ప్రజా వ్యతిరేకత ఉన్నా ఓట్లే ఓట్లు – బీజేపీకి సుడికాలం !
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/నవంబర్ 25: భారతీయ జనతా పార్టీ ఎలా గెలుస్తుందబ్బా అని రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి చాన్స్ లేదని ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ప్రచార జరిగిన రాష్ట్రాల్లోనూ అంతకు ముందు కంటే ఘన విజయాలు సాధించారు. ఇటీవల హర్యానా, ఇప్పుడు పహారాష్ట్ర ఎన్నికలను తీసుకుంటే అదే విషయం మన కళ్ల ముందు ఉంటుంది.
హర్యానాలో అసలు బీజేపీకి చాన్స్ లేదనుకున్నారు. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అనుకూలంగా రాలేదు. ఊహించని ఫలితాలు వచ్చాయి. గతం కంటే బీజేపీకి సీట్లు పెరిగాయి. బీజేపీపై హర్యానాలో ప్రజా వ్యతిరేకత ఉంది కానీ ఇతర పార్టీలకు ఓటేసే ధైర్యం ప్రజలకు రాలేదని అందరూ సర్ది చెప్పుకున్నారు. ఇక మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయిన అజిత్ పవార్ కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో దున్నేశారు. థాక్రేలను కాదని షిందేకే శివసేన వారసుడిగా ప్రజలు గుర్తించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్దవ్ పార్టీకే ఎక్కువ మంది ఎంపీ సీట్లు వచ్చాయి.
బీజేపీ రెండు పార్టీలను చీల్చి.. నాలుగు పార్టీలను చేసిందని అక్కడ ఆ పార్టీపైనా ప్రజాగ్రహం ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటి చాయలే కనిపించలేదు. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించేశారు. ఇలాంటి విజయాలను నమ్మడం చాలా కష్టం. కానీ బీజేపీ మాత్రం.. అసాథ్యాన్ని సుసాధ్యం చేస్తోంది.