బీఆర్ఎస్ దీక్షా దివస్ – కాంగ్రెస్ తెలంగాణ దివస్
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ నవంబర్ 25: తెలంగాణలో ఉత్సవాల సమయం వచ్చేసింది. ఆ ఉత్సవాలు మాత్రం రాజకీయ ఉత్సవాలు. అందరివీ విజయోత్సవాలే. కాకపోతే ఎవరికి వారి విజయోత్సవాలు. కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణదీక్ష ప్రారంభించిన రోజును దీక్షా దివస్‌గా చేసుకోవాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు కూడా పిలుపునిచ్చేవారు కానీ అప్పట్లో చాలా మంది నేతలకు తీరిక ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరూ ఖాళీగానే ఉన్నారు. అందుకే ఘనంగా చేయాలని జిల్లాల వారీగా ఇంచార్జుల్ని నియమించారు
తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉన్న నిర్బంధాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి కొత్తగా మరోసారి దీక్షా దివస్ స్ఫూర్తిని మనసులో రగిలించుకుని పోరాడాల్సిన సమయం ఆసన్నమయిందని కేటీఆర్ అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ డిసెంబర 9ని సెలబ్రేట్ చేయడానికి రెడీ అయింది. ఆ రోజున ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఆ రోజు సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేయబోతున్నారు.
సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో బీఆర్ఎస్ ఫైనల్ చేసిన విగ్రహం కాదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ విగ్రహాన్ని అంతర్గతంగా ఫైనల్ చేయించి పెట్టబోతున్నారు. పబ్లిక్‌లో పెడితే మళ్లీ రకరకాల విమర్శలు వస్తాయనిఅనుకున్నారేమో తెలియదు. మొత్తంగా రెండు పార్టీలు పోటాపోటీగా రెండు దివస్‌లు నిర్వహించబోతున్నాయి. ఈ రెండింటికి కేంద్రం తెలంగాణనే.