ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం/బోనకల్లు: అధికారం ఎవరి సొత్తూ కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో సోమవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కొందరు నాయకులు ఏడున్నరేళ్లుగా తనను, తన అనుచరులను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస(భారాస) అభ్యర్థులు ప్రజావ్యతిరేకత, స్వయంకృతాపరాధంతో ఓడిపోయారని.. కానీ, తాను ఓడించానని చెప్పి తనపై కక్షకట్టారని చెప్పారు. సిట్టింగ్ ఎంపీ అయినా తనకు సీటు ఇవ్వలేదన్నారు. తాను ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా, ఎవరినైనా పరామర్శించాలన్నా స్థానిక ప్రజాప్రతినిధుల అనుమతి తీసుకోవాలంటూ ఆంక్షలు విధించారని వాపోయారు. తన ఆవేదనను చెప్పుకొనే అవకాశం కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ఇన్ని అవమానాలతో పనిచేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.