అమెరికా మనకు భూలోక స్వర్గం.. మరి అమెరికన్లు దేశం వీడుతున్నారేం?
హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/నవంబర్ 14: ట్రంప్ గెలిచాక దేశం విడిచివెళుతున్న చాలామంది అమెరికన్లు కెనడా, ఈయూ దేశాలకు పయనం. రాజకీయాల కారణంగా దేశంలో ఉండలేకపోతున్నారట
అమెరికా వెళ్లడం, అక్కడే సెటిలవడం చాలామంది భారతీయుల కల కొంతమంది ఉన్నత విద్య కోసం వెళ్లి ఉద్యోగం సంపాదించుకుని అక్కడే ఉండిపోతుండగా మరికొందరు అక్రమ మార్గంలో వెళ్లడానికీ వెనుకాడడం లేదు. అత్యంత ప్రమాదకరమైన డాంకీ రూట్ లో ప్రాణాలకు తెగించి మరీ అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. పంజాబ్ కు చెందిన ఓ కుటుంబం ఇలాగే ప్రయత్నించి కెనడా అమెరికా సరిహద్దుల్లో గడ్డ కట్టించే చలికి బలైపోయిన విషయం తెలిసిందే. అమెరికాను మనం భూలోకంలోని స్వర్గంలా చూస్తాం.. అక్కడుండే అమెరికన్లు మాత్రం ఇదేం దేశంరా నాయనా అనుకుంటున్నారట.
ఈ దేశం నుంచి ఎలా బయటపడాలా అని గూగుల్ లో వెతుకుతున్నారట. ఇటీవలి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఈ ట్రెండ్ మరింత పెరిగిందని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ఓటేయాలంటూ ఎలాన్ మస్క్ అమెరికన్లకు పిలుపునివ్వగా ఆయన ట్రాన్స్ జెండర్ కూతురు వివియాన్ జెన్నా విల్సన్ మాత్రం ట్రంప్ గెలవడంతో తనలాంటి వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయింది. అమెరికాలోని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ రెడ్డిట్ లో దీనిపై భారీగా చర్చ జరుగుతోంది.
ఇలా అమెరికాను వదిలి వెళ్లాలనే ఆలోచనకు అమెరికన్లు ‘అమరెక్జిట్’ అని పేరుకూడా పెట్టుకున్నారు. ఇలా ఆలోచిస్తున్న ఉద్యోగుల కోసం అమెరికాలోని పలు కంపెనీలు ప్రపంచంలోని ఏ దేశంలో నుంచి అయినా పనిచేసే సౌలభ్యం కూడా కల్పిస్తున్నాయి. ‘నొమడ్ వీసా’ పేరుతో పలు దేశాలు అమెరికన్లకు వీసాలు జారీ చేస్తున్నాయి. ఇక అమెరికా పొరుగున ఉన్న కెనడా మాత్రం ఇప్పటికే వలసదారులతో సతమతమవుతున్నామని, కొత్తగా దేశంలోకి వచ్చే వారి వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొనలేమని చెబుతూ బోర్డర్ లు మూసేస్తోంది. అమెరికా సరిహద్దుల్లో భద్రత, నిఘా వ్యవస్థలను కట్టుదిట్టం చేసింది. ట్రంప్ గెలవడంతో చాలామంది అమెరికన్లు తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చే అవకాశం ఉందని ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. దీనిని అరికట్టేందుకు తమ దృష్టి మొత్తం బోర్డర్ పైనే కేంద్రీకరించామని చెప్పారు.
అమెరికాను ఎందుకు వీడుతున్నారంటే..
అబార్షన్ చట్టాల విషయంలో ట్రంప్ వైఖరిని చాలామంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. వలస విధానాల విషయంలోనూ ఆయనను తప్పు బడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ అబార్షన్ చట్టాల విషయంలో ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో అబార్షన్ పై బ్యాన్ విధించాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకోవాలన్నారు. అయితే, దేశవ్యాప్తంగా అబార్షన్ బ్యాన్ విధించే ముసాయిదా ప్రతిపాదనపై ట్రంప్ సంతకం చేసినట్లు అమెరికన్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దేశవ్యాప్తంగా అబార్షన్లపై బ్యాన్ విధిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ శరీరంపై తమకే హక్కు ఉండాలని, అబార్షన్ హక్కుల విషయంలో రాజీ పడలేమని మహిళలు తేల్చి చెబుతున్నారు. ఈ కారణంగా దేశం వీడాలని భావిస్తున్నట్లు చాలామంది మహిళలు చెప్పారు. వీటితో పాటు అమెరికాలో కాస్టాఫ్ లివింగ్, నిరుద్యోగం, పెరుగుతున్న కాల్పుల ఘటనలు తదితర ఇతర సమస్యలు కూడా అమెరికన్లు దేశం విడిచి వెళ్లేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.