ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/నవంబర్ 14: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ అధినేతకు తాను ఫైనాన్స్ చేశానని అన్నారు రేవంత్. తాను టీఆర్ఎస్‌లో పని చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మందితో పాటు కేసీఆర్‌కు తానూ ఫైనాన్స్ చేశానన్నారు. అయితే ఉద్యమం సాగుతున్న టైమ్‌లో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతు ఇచ్చారని దాన్నే వాళ్లు పెట్టుబడిగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రాష్ట్ర, కేంద్ర రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారు..
కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉందన్నారు రేవంత్. 17ఏ కింద ఆల్రెడీ గవర్నర్ అనుమతి కూడా కోరామన్నారు. అయితే 15 రోజులుగా ఇది గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉందన్నారు సీఎం. రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఢిల్లీకి వచ్చారని ఆరోపించారు. బీజేపీ-బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడిందన్నారు రేవంత్. ఇక, లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ పక్కా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ 240కే పరిమితమైందన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల నుంచి తమ బలాన్ని వందకు పెంచుకుందని తెలిపారు. నంబర్లు చూస్తే ఎవరు నెగ్గారనేది అర్థమైపోతుందన్నారు.
చంద్రబాబుతో కలసి పనిచేశా..
‘ఇది బీజేపీ ఓటమి కాదు.. నరేంద్ర మోడీ ఓటమి. ప్రతీ దానికి మోడీ ముద్ర వేశారు. మోదీ గ్యారెంటీ అన్నారు. ఆయన గ్యారెంటీకి సంబంధించిన వారెంటీ పూర్తవుతుందని నేను ఎన్నికలకు ముందే చెప్పా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఇది మోడీ ఓటమే. చంద్రబాబు-నితీశ్ తలచుకుంటే మోడీ సర్కారు ఒక్క ఏడాది కూడా అధికారంలో కొనసాగదు. అప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది’ అని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలసి తాను వర్క్ చేశానన్నారు.