దీపావళి వేళ హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్..
దీపావళికి క్రాకర్స్ కాల్చటంపై పోలీసుల ఆంక్షలు
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/అక్టోబర్ 27: దీపావళి పండుగ అంటేనే పటాకులు భూమి మీద పేల్చే బాంబులే కాదు ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టుగా జనాలు భావిస్తుంటారు.
దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి వరకు ఈ మోత మోగుతూనే ఉంటుంది. అయితే దీపావళి వేళ హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. క్రాకర్స్ కాల్చటంపై ఆక్షలు విధించారు.
ఎంతో ఉత్సాహంగా పెద్ద ఎత్తున పటాకులు కాల్చాలని భావిస్తున్న వారికి పరిమితులు విధిస్తూ తాజాగా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కువ శబ్దంతో వచ్చే బాణాసంచా కాల్చకూడదంటూ, పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.
దీపావళి పండగ రోజున హైదరాబాద్ నగరంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలని హైదరాబాద్ పోలీసులు పరిమితి విధించారు. కేవలం ఈ రెండు గంటల్లోనే టపాసులు కాల్చాలని ఆ తర్వాత ఎలాంటి బాణాసంచా కాల్చొద్దని హెచ్చరించారు.
ఈ రెండు గంటల సమయంలోనూ భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చటంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్ మించి శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చొద్దని పోలీసులు హెచ్చరించారు.