‘మన ఊరు-మన బడి’ 1న ప్రారంభం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
‘మన ఊరు- మన బడి’,‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
‘మన ఊరు-మన బడి’ 1న ప్రారంభం
మొదటి విడత 1,200 స్కూళ్లల్లో పనులు పూర్తి
పండుగ వాతావరణంలో ప్రారంభ వేడుక
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
నేడు కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’,‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు మొదటి విడతలో పనులు పూర్తయిన బడులను 30వ తేదీ బదులు ఫిబ్రవరి 1న ప్రారంభిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లోనూ 12 రకాల వసతులు కల్పించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఒకే నియోజకవర్గంలో పనులు పూర్తయిన పాఠశాలలు అధికంగా ఉంటే తదుపరి రోజుల్లో ప్రారంభించుకోవచ్చని చెప్పారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతో సమన్వయం చేసుకొని పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో పేరెంట్స్ కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
మొత్తం 3 దశల్లో 3 ఏండ్లలో రాష్ట్రంలోని 26,055 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం సంకల్పించినట్టు మంత్రి పేర్కొన్నారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను రూ.3,497.62 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, పనుల విషయంలో ఎక్కడా రాజీలేకుండా చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు. పాఠశాల వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటే విద్యార్థులకు అంత సులువుగా చదువుకొనేందుకు వీలుంటుందని అన్నారు.
నేడు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
‘మనఊరు -మన బడి, ‘మన బస్తీ-మన బడి’ ప్రారంభోత్సవాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ప్రారంభించే బడులు, ఏ జిల్లాలో ఎవరెవరు ప్రారంభిస్తారన్న అంశాలను ఇందులో సమీక్షించే అవకాశం ఉన్నది.