హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ అక్టోబర్ 19: వానకాలం ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వమని ఎగవేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చినట్లుగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగిందని వెల్లడించారు. ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండ గట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండి పడ్డారు.
రుణ మాఫీ మోసం చాలదన్నట్లు ఇప్పుడు రైతు భరోసాలోనూ దగా చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజా ప్రతినిధులను ప్రజలే నిలదీస్తారని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదని స్పష్టం చేశారు.