ఒక చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం ప్రతిమ ఏర్పాటు
బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో కొత్తగా రూపుదిద్దుకున్న న్యాయదేవత..
సుప్రీం కోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో నూతన విగ్రహం ఏర్పాటు..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/న్యూఢిల్లీ/ అక్టోబర్ 17: బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తుల సవరణల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టులు, లీగల్ ఛాంబర్లు, సినిమాలలో కళ్లకు గంతలు కట్టి కనిపించే ‘న్యాయ దేవత’ విగ్రహం రూపు మారింది. కళ్ల గంతలను సుప్రీంకోర్ట్ తొలగించింది. అంతేకాదు న్యాయ దేవత ఒక చేతిలో ఉండే ఖడ్గం స్థానంలో రాజ్యాంగ ప్రతిని ఉంచింది. బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు.
భారతీయ న్యాయవ్యవస్థ చిహ్నానికి కొత్త రూపును తీసుకురావడమే లక్ష్యంగా ఈ కీలక మార్పులు జరిగాయి. తద్వారా ‘చట్టం ఇకపై గుడ్డిది కాదు’ అని సుప్రీంకోర్ట్ స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయింది. ఈ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చొరవ చూపించారు. మార్పుల అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.