92 నియోజకవర్గాల్లో 641 పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
గ్రామీణ ప్రాంతాల్లో 1,323.86 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం..
హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్/ అక్టోబర్ 15: హైదరాబాద్ లో వర్షమొస్తే చిత్తడిగా మారుతున్న పల్లె దారుల్లో ఇక ప్రయాణం హాయిగా సాగేలా రాష్ట్ర సర్కారు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్ట బోతున్నది.
మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. గ్రామాల్లో 1,323 కిలో మీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణ పనుల కోసం రూ. 1,377.66 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులు చేపట్టేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెల్లో ప్రగతి బీజం వేసేందుకు భారీగా నిధులు కేటాయించింది. సీఆర్ఆర్ రోడ్ల కోసం మరో రెండు, మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల మేర నిధులు మంజూరు చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆమె చెప్పారు. ప్రజల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లకు నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
పట్టుబట్టి.. నిధులు సాధించి..
గడిచిన పదేండ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అనుకున్న స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో పల్లె రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఎమ్మెల్యేలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. నియోజవకర్గాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పల్లెల్లో రోడ్లు నిర్మిస్తే ప్రజల రవాణా ఇబ్బందులు తీరుతాయని, వానాకాలంలో రాకపోకలకు అంతరాయం ఉండదని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ రోడ్లకు రూ.1,377 కోట్లు నిధులు మంజూరు చేసేలా కృషి చేశారు.