హ్యూమన్ రైట్స్ టుడే/విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంతకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో ఆయన మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. 2014 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు వసంతకుమార్ దూరంగా ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.