ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రంగంలో దిగిన హోంమంత్రి..
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ / అమరావతి/ న్యూస్/అక్టోబర్ 14: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సోమవారం నాటికి ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఫలితంగా ఏపీలో విస్తారంగా వర్షాలు పడొచ్చు. వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం పొడవునా హిందూ మహా సముద్రం వరకు ఈ ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది సోమవారం నాటికి అల్పపీడనం మారడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. నైరుతి బంగాళాఖాతం గగన తలంపై ఈ అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
దీని ప్రభావంతో 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 14, 15, 16 తేదీల్లో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి వరద ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగల పూడి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని, వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, జలవనరులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నేడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడొచ్చు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.