కర్నూలు జిల్లా దేవరగట్టు జాతరలో కర్రల సమరం..!!
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/కర్నూలు జిల్లా/అక్టోబర్ 13: ఏపీలో ప్రతీయేటా దసరా పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు జరగడం సంప్రదాయం. ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది.
ఉత్సవ మూర్తుల విగ్రహాలను దక్కించుకోవడానికి కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నరకు జరిగిన బన్నీ ఉత్సవం ఒళ్లు గగుర్పాటు గొలిపే విధంగా సాగింది.
ఈ ఉత్సవంలో 11 గ్రామాల ప్రజలు పాల్గొనగా 100 మందికిపైగా గాయాలయ్యాయి. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా మారగా వారిని చికిత్స నిమిత్తం ఆలూరు, ఆదోని, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మాళమల్లేశ్వరస్వామి కోసం జరిగిన కర్రల సమరంలో గ్రామాల ప్రజలు కర్రలతో తలపడ్డారు.
ఈ క్రమంలో పలువురికి తలలు పగిలి రక్తం చిందింది. ఐరన్ రింగ్లు తొడిగిన కర్రలు, అగ్గి దివిటీలతో జైత్రయాత్ర కొనసాగింది. బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
సుమారు రెండు లక్షల మందికిపైగా భక్తులు ఈ ఉత్సవాన్ని చూసేందుకు తరలివచ్చినట్లు అంచనా. బన్నీ ఉత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కర్నూల్ జిల్లా మండలంలోని దేవరగట్టులో ప్రతీ యేటా దసరా సందర్భంగా కర్రల సమరం జరగడం సంప్రదాయంగా వస్తుంది. దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవంకు విశేష ప్రాముఖ్యత ఉందని అక్కడి స్థానికులు చెబుతారు.
ఇక్కడ స్వామి దేవతా మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపున అరికెర, అరికెరతండా, కురుకుంద, బిలేహాల్, సుళువాయి, ఎల్లార్తి, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపున కర్రలతో కొట్లాటకు దిగారు.