డిమాండ్-సప్లైకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఏపీ సీఎం

Get real time updates directly on you device, subscribe now.

సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై రివ్యూ

ప్రజలపై భారం పడకుండా చూడాలని అధికారులకు సీఎం సూచన

డిమాండ్ – సప్లైకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 12: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై ధరల భారం లేకుండా చూడాలని సిఎం అధికారులకు సూచించారు.

డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ధరలు పెరిగిన తర్వాత తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం కంటే మూడు శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని సూచించారు.

నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలకు, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ రివ్యూలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆన్‌లైన్ విధానంలో హాజరయ్యారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షలో వివరించారు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయలు రైతు బజార్ లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు.

విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.

పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చని సీఎం సూచించారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే వారు హర్షిస్తారని, ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment