మనిషైతే..మనసుంటే..
గెలుపు నీదే సుమా.!
(మానసిక ఆరోగ్య దినం సందర్భంగా)
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 10:
కష్టం, నష్టం..
బాధ, భయం..
ఆవేదన, ఆందోళన..
వీటన్నిటినీ ఎదుర్కొనే
ఒకే మార్గం..
మనోబలం..!
అన్యాయం..అరాచకం..
ఆక్రమణ..అతిక్రమణ..
దాష్టీకం..దుర్మార్గం..
వీటికి ఒకే సమాధానం..
మనోనిబ్బరం..!
మనిషికి కాక
మానుకు వస్తాయా కష్టాలు..
మానుకు వచ్చినా
దానికి మనసెక్కడ..
బాదొచ్చినా వ్యక్తం చేసే
భావమెక్కడ..
మహా అయితే మౌనరోదన..
కానీ మనిషున్నాడే..
వాడికే ఉంది మనసు..
కష్టం దానికే తెలుసు..
అలా తెలియడమే దాని
బలమూ..బలహీనతా!
ఈ సృష్టిలో ఏ జీవికీ లేని
ఓ వరం..
మనిషికి అదే ఇహం పరం..
మనసు..!
నీ బలం
దానికే పూర్తిగా తెలుసు
అది ఉండగా
నువ్వెందుకు కావాలి
ఇంకొకరికి అలుసు..!
నీలో నువ్వు..నీతో నువ్వు
నీ కోసం నువ్వు
బలంగా ఉంటే
నువ్వు ప్రపంచాన్ని
జయించినట్టే..!
మనసున్న ఓ మనిషీ..రా..
ఎంతటి కష్టాన్నయినా
తీసిపారేయ్..
ఎవరెంత బెదరించినా
ఎదురు నిలబడు..
నీ హక్కుల కోసం పోరాడు..
వీలైతే ఒక్కడుగా..
లేదంటే సమిష్టిగా..
ఎదురెళ్ళితే..ఎదురు నిలిస్తే..
కష్టమే తలవంచదా..
శాసిస్తుందని నువ్వనుకునే
విధైనా నీ ముందు
మోకరిల్లదా..!
అన్నట్టు..
ప్రేమలో ఓడావని..
పరీక్షలో తప్పావని..
అప్పులోడు వేధించాడని..
ఉద్యోగం రాలేదని..
పెళ్ళాం తిట్టిందని..
తోడికోడలు దెప్పిందని..
ఎవరో ఎగతాళి చేశారని..
ప్రాణం తీసుకోవడం..
ఏం న్యాయం..
నూరేళ్ళ బ్రతుక్కి
మూన్నాళ్ళకే చరమగీతం..
జీవితంపై ఇదేనా
నీ అవగతం..
ఇంతేనా నీ ఇంగితం..
చచ్చి సాధించేది ఏంటి..
నిలిస్తేనే గెలుస్తావు..
అలా నిలవాలంటే..
గెలవాలంటే..
కావాలి నీ ఆయుధం..
మళ్లీ మళ్లీ మనోబలం..!