యేండ్లుగా ఎదురు చూస్తున్న పత్రికలకు మొండిచేయి..

Get real time updates directly on you device, subscribe now.

భజన మీడియాలకే అందలమా?
కేసీఆర్‌ తోవలోనే రేవంత్‌?
కొన్ని పత్రికలకు మాత్రమే ప్రత్యేక జీవో ద్వారా ఎన్‌ప్యానెల్‌మెంట్‌..
ఎన్నో యేండ్లుగా ఎదురు చూస్తున్న పత్రికలకు మొండిచేయి..
పలుకుబడి, పెద్దల అండదండలుంటే నిబంధనలు అక్కర్లేదు..
రేట్‌కార్డులు..ఎన్‌ప్యానెల్‌మెంట్లు అవే వచ్చేస్తాయి..
రేవంత్‌ సార్‌ ఇదెక్కడి న్యాయం?
వెంటనే అన్ని పత్రికలకు న్యాయం చేయాలి..లేదంటే ఆందోళన తప్పదు:డీజేఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి హెచ్చరిక

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 04: గత బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో పాత్రికేయ రంగం కుదేలయిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణోద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన చిన్న పత్రికలు, మీడియాలను కేసీఆర్‌ సర్కార్‌ ఆదుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాశారంటూ చాలామంది పాత్రికేయులపై కేసులు బనాయించి జైళ్లపాలు చేశారు. ఇక అప్పట్లో పనిచేసిన మీడియా అకాడమీ ఛైర్మెన్‌ ప్రభుత్వ చేతిలో కీలు బొమ్మలా వ్యవహరించి తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోగలిగారనే విమర్శలున్నాయి. మీడియా అకాడమీ ఛైర్మెన్‌గా అల్లం నారాయణతో పాత్రికేయ లోకానికి ఉపయోగం శూన్యంగానే మిగిలింది. ఆయనకు ఏదైనా చేయాలని ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ప్రయత్నాలు ఏవీ ఆచరణ సాధ్యం కాలేదు. ఇక తమ పత్రికలు నిబంధనల ప్రకారం నడుపుతున్నాం, ప్రింట్‌ చేస్తున్నాం, కావున మా పత్రికలను ఎన్‌ప్యానెల్‌మెంట్‌ చేసి రేట్‌ కార్డు ఇవ్వండంటూ చాలా పత్రికలు దరఖాస్తు చేసుకున్నా కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే తమ స్వంత మీడియాలతో పాటు తమకు మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు తెలిపిన ఓ పార్టీ పత్రికకు మాత్రం ప్రత్యేక జీవోతో రేట్‌కార్డును అమాంతం పెంచి పెద్ద పత్రికల సరసన చేర్చడంలో అప్పటి రాజకీయమే దాగి ఉన్నది. ఈ విషయంపై అప్పుడు కొన్ని మీడియాలు, జర్నలిస్టు సంఘాలు అలా ఎలా ఇస్తారు? మా పత్రికలకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. ఇక పాత్రికేయుల ఇండ్ల జాగలు, సంక్షేమ విషయంలో నాటి బీఆర్‌ఎస్‌ పాలనలో ఒరిగిందేమీ లేదు. ఇదంతా గత కేసీఆర్‌ పాలనలో చూసిన నిజాలు. మనకు భజన చేసే మీడియాలకు దోచిపెట్టే విధానమే నాటి కేసీఆర్‌ పాలనలో చూశాం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, విధానాలతోనే అన్ని వర్గాల నుంచి పూర్తి వ్యతిరేకత మూటగట్టుకుని బీఆర్‌ఎస్‌ పాలకులు పతనమయ్యారు. అధికారం ఉన్నన్నాళ్ళూ కన్నూమిన్ను కానకుండా మీడియాలు, పత్రికలు అంటే కేవలం కార్పోరేట్‌ మీడియాలు, పార్టీ మీడియాలే అనే విధానాన్ని అవలంభించి కొందరు తాబేదారు యూనియన్‌ నేతల మాటలు విని మట్టికరిచిన విషయం కాదనలేని చరిత్ర. మేం అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తాం, పాత్రికేయ రంగాన్ని ఉద్దరిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలు, ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌ నేతలు గద్దెనెక్కిన తర్వాత సేమ్‌ టూ సేమ్‌ కేసీఆర్‌ తోవలోనే పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండ్ల జాగల పంపిణీలో జరిగిన అవకతవకలు తెలిసిందే. ఆ ఇండ్ల జాగల పంపిణీలో ఇండ్ల జాగలు తీసుకున్న పాత్రికేయులు రెండు మూడు ప్రదేశాల్లో ఇండ్ల స్థలాలు అందుకున్నారు. అలాంటి వారికి స్వయంగా సీఎం రేవంత్‌ చేతుల మీదగా మరోమారు ఇండ్ల జాగల పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ఆనాడు సీఎం రేవంత్‌ యూట్యూబ్‌ చానెళ్లు, కొన్ని మీడియాల మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. తమకు వ్యతిరేకంగా పోయే మీడియాలను తొక్కేస్తాం అనే హెచ్చరిక మాటలే సీఎం నోటి వెంట వచ్చాయనే విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే అక్టోబర్‌ నెలలో సీఎం రేవంత్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. ఓ ఐదు పత్రికలను పెద్ద పత్రికలుగా గుర్తిస్తూ వాటికి రేట్‌కార్డు ఇచ్చి ఎన్‌ప్యానెల్‌మెంట్‌ చేస్తూ ఓ పత్య్రేక జీవో ఇవ్వడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఆరు నెలలకు ఓ సారి ఎన్‌ప్యాన్‌ల్‌మెంట్‌ చేయాల్సి ఉండగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ ఊసే ఎత్తకుండా కేవలం తమకు వంత ఉపయోగపడే పత్రికలు, మీడియాలకే ప్రత్యేక జీవోల ద్వారా రేట్‌కార్డు పెంచుతూ ఎన్‌ప్యానెల్‌మెంట్‌ చేయడం గమనార్హం. నాడు బీఆర్‌ఎస్‌ పాలనలో మునుగోడు ఎన్నికల సమయంలో లబ్ధికోసం ఓ పత్రికకు రేట్‌కార్డు ప్రత్యేక జీవో ద్వారా  ఇవ్వడం చూశాం. ఇప్పుడు అదే విధానంలో ఓ ఐదు పత్రికలకు రేట్‌కార్డు ఇస్తూ రేవంత్‌ సర్కార్‌ ఎప్యానెల్‌మెంట్‌ చేయడం చూస్తున్నాం. అందుకే పాలకులే మారారు విధనాలు సేమ్‌ టు సేమ్‌ అని చెప్పాల్సి వస్తోంది. సరే మీడియాలకు రేట్‌ కార్డులు ఇచ్చి ఎన్‌ప్యానెల్‌మెంట్‌ చేయడం పాత్రికేయ రంగాన్ని ఆదుకోవడం కావచ్చు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యవారధిగా ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియా రంగాన్ని ఆదుకోవాల్సిందే. ఇందులో ఇతర అభిప్రాయానికి తావులేదు. ఓ పక్క బీఆర్‌ఎస్‌ పాలనలో పాత్రికేయ రంగం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. తమ అనుకూల మీడియాలకు మాత్రమే దోచి పెట్టారంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్‌ పాలకులు మరి ఇప్పుడు వారు చేసిందేమిటి? తమకు అనుకూలంగా ఉన్నారనో, తమకు ఉపయోగపడతారనో లేక పెద్ద యూనియన్ల నేతలు ఈ మీడియాల వెనక ఉన్నారనే కారణంతోనో వీటికి రేట్‌ కార్డులు ప్రత్యేక జీవో ద్వారా ఎలా ఇచ్చారు? అని జర్నలిస్టు సర్కిల్లో చర్చ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ పాలనలో తమకు అనుకూల మీడియాలకు దోచిపెడితే ఇప్పుడు కాంగ్రెస్‌ పాలకులు తమకు అనుకూలంగా ఉన్న మీడియాలకు అదే అవకాశాన్ని ఇస్తే ఇవ్వనీయండి కానీ కొన్నేండ్లుగా మేం కూడా చాలా కష్టనష్టాలకోర్చి పత్రికలను నడుపుతుంటే మా పత్రికలకు వివిధ కారణాలు చూపెడుతూ పక్కన పడేయటం ఏం న్యాయమని వివిధ పత్రికల యజమానాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే దాదాపు 250 పత్రికలు, 300 మ్యాగజైన్లు ఎన్‌ప్యానెల్‌ మెంట్‌ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాయి. వివిధ కారణాలు చూపెడుతూ ఆ పత్రికలను పక్కకు పడేసి ప్రత్యేక జీవో ద్వారా కొన్ని పత్రికలకు అత్యధిక రేట్‌కార్డు ఇవ్వడం ఏం న్యాయం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. చాలామంది నిఖార్సయిన పాత్రికేయులు ఎంతో నిజాయితీగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ పత్రికలను నడుపుతున్నారు. ఎన్‌ప్యానెల్‌ మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలకోసారి ఎన్‌ప్యానెల్‌ మెంట్‌ చేయాల్సిన అధికారులు ఎనిమిదేండ్లుగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చాలామంది ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు వృత్తి మీద మమకారం చంపుకోలేక పత్రికలను విజయవంతగా నడిపిస్తూ ఆశేష పాఠకుల ఆదరణ చూరగొంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవాల్సిందిపోయి కొందరు యూనియన్‌ పెద్దలు నిర్వహించే పత్రికలను, పార్టీ నేతలు నడిపే మీడియాలను, పార్టీ పత్రికలను, కార్పోరేట్‌ మీడియాలను మాత్రమే ఆదరించి వాటి సేవలో తరించిపోవడం సిగ్గు చేటు. అసలు ఇప్పుడు ఎన్‌ప్యానెల్‌ మెంట్‌ చేస్తూ ప్రత్యేక జీవో ద్వారా గుర్తించిన పత్రికల సర్యులేషన్‌ ఎంత? ఎప్పటి నుంచి అవి ప్రింట్‌ తీస్తున్నాయి? వాటి నిర్వాహకులు ఎవరు? ఆయా మీడియాల వెనక ఉన్న యూనియన్‌ పెద్దలు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో కేవలం కేసీఆర్‌ని టార్గెట్‌గా చేసుకుని అవాస్తవాలను ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసిన కొన్ని మీడియాలను రేవంత్‌ రెడ్డి నాడు ఆర్థికంగా ప్రోత్సహించినట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా వాటికి ప్రభుత్వ ఖజానా నుంచే పంచి పెట్టే కార్యక్రమానికి పూనుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఓ ఇద్దరు ముగ్గురు యూనియన్‌ నేతలు తమ పలుకుబడితో తమ మీడియాలకు అన్ని అవకాశాలను, అందిపుచ్చుకోవడాలను విజయవంతంగా చేయగలిగారు. ఇక త్వరలోనే మరికొన్ని మీడియాలను కూడా ఇదే కోవలో చేర్చనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని మీడియా అకాడమీ ఛైర్మెన్‌గా నేడు ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి అవకాశం ఉన్నప్పుడే తన అనుకూల మీడియాలకు అన్ని లాభాలు చేకూర్చే పనిలో ఉన్నట్లుగా విమర్శలున్నాయి. నాడు బీఆర్‌ఎస్‌ నేడు కాంగ్రెస్‌ అంతా ఒక్కటే పేరుకే పెద్ద మాటలు చేతలు మాత్రం ఒక్కటే.

పెండింగ్ లో ఉన్న పత్రికలకు వెంటనే రేట్‌కార్డు ఇవ్వాలి:
డిజెఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి.

కేవలం కొన్ని మీడియాలకు మాత్రమే ప్రత్యేక జీవోల ద్వారా రేట్‌కార్డు ఇచ్చి మిగతా పత్రికలను పట్టించుకోకపోవడం దారుణమని డెమొక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (డీజేఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అనుకూల మీడియాలను మాత్రమే పెద్ద మీడియాలుగా గుర్తించి ఎన్నో యేండ్లుగా ఎన్‌ప్యానెల్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్న అనేక పత్రికల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం ప్రభుత్వానికి, అధికారులకు తగదని ఆయన అన్నారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న అన్ని పత్రికలను ఎన్‌ప్యానెల్‌మెంట్‌ చేసి వాటికి రేట్‌ కార్డు అధికంగా నిర్ణయించి ఆయా పత్రికలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఏ పార్టీలకు వంతపాడకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా నడుపుతున్న పత్రికలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. జర్నలిజం అంటే కేవలం కార్పోరేట్‌ మీడియాలు, పార్టీ మీడియాలు, లాబీయిస్టుల మీడియాలు కాదని ప్రజల కోసం పని చేసేదే నిజమైన మీడియా అని అన్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండటం తగదని వెంటనే అన్ని మీడియాలకు ఎన్‌ప్యానెల్‌ మెంట్‌ ఇవ్వాలని లేని పక్షంలో డీజేఎఫ్‌ తరపున ఆందోళన చేపడుతామని, ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నడిచే ప్రతి మీడియాకు అండగా ఉంటామని మానసాని కృష్ణా రెడ్డి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment