హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 01: వైసీపీ, బీఆర్ఎస్ లు కొంచెం అటు, ఇటుగా ఒకేసారి అధికారం కోల్పోయాయి. పదేళ్లు అధికారంలో కొనసాగి మరోసారి పవర్ లోకి వస్తామని కలలు గన్న బీఆర్ఎస్ కు ఆశనిపాతమే ఎదురైంది. వైసీపీ కూడా ఐదేళ్ల తమ హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేశామని తమదే అధికారమని గంపెడు ఆశలు పెట్టుకుంది. కానీ, రెండు పార్టీలు ఊహించని విధంగా ఓటమి పాలయ్యాయి.
ఇక, అధికారం కోల్పోయిన రెండు పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఊపిరిసల్పనివ్వడం లేదు. పలు కేసులు రెండు పార్టీలకు చెందిన నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వరుసగా నేతలు పార్టీని వీడుతుందటంతో దూకుడుగా రాజకీయాలు చేసి, పార్టీని కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు. ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు అటు బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రయత్నిస్తున్నా ఆ పయత్నాలూ ఫలించడం లేదు.
ఈ క్రమంలోనే కాదంబరి జెత్వాని కేసు, మదనపల్లి ఫైల్స్ ఘటన, ప్రకాశం బ్యారేజ్ బోటు ప్రమాదం, తిరుమల లడ్డూ వంటి విషయాలతో వైసీపీ ఇరుకున పడితే, తెలంగాణలో కొన్నాళ్లుగా బీఆర్ఎస్ కు ఎలాంటి అస్త్రం లేక బేలగా కనిపించగా తాజాగా హైడ్రా అస్త్రంతో మంచి టచ్ లో కనిపిస్తోంది. పలు అంశాల్లో బీఆర్ఎస్, వైసీపీ సారూప్యత కనిపిస్తున్నా తెలంగాణలో బీఆర్ఎస్ కు వచ్చిన మైలేజ్ వైసీపీకి రావడం లేదు.
వైసీపీ హయాంలో వ్యవహరించిన విధానాల ఫలితంగా ఆ పార్టీని జనం ఇప్పట్లో విశ్వసించే ఛాన్స్ లేదని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది.