15 ఏండ్లు దాటిన బండ్లు ఇక తుక్కు కిందికే..
త్వరలో రాష్ట్రంలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ..
పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం..
పాత బండ్ల తుక్కుకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు..
కొత్త బండ్లను కొంటే 10 శాతం డిస్కౌంట్..
వెహికల్స్ను స్క్రాప్గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ..
రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షల పైనే..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/14 సెప్టెంబర్: రాష్ట్రంలో వాహనాల పొగతో హైదరాబాద్, ఇతర సిటీల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో పొల్యూషన్ ను కంట్రోల్ చేయడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. పదిహేనేండ్లు దాటిన టూ, త్రీ, ఫోర్ వీలర్లను ఇకపై రోడ్లపైకి అనుమతించరాదని, వాటిని తుక్కుగా మార్చాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్వీఎస్ఎఫ్ (రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ) పేరుతో కొత్త పాలసీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ పాలసీని అమలు చేస్తున్న మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో మన రవాణా శాఖ అధికారులు పర్యటించి పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకుగాను టెండర్లు ఆహ్వానించగా టాటా, మహీంద్రా, మరో కంపెనీ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు హైదరాబాద్ తోపాటు మరో రెండు చోట్ల పాత వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చే యూనిట్ల పనులు ప్రారంభించాయి. రాష్ట్రంలో టూ, త్రీ, ఫోర్ వీలర్లు కలిపి దాదాపు కోటికిపైనే ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షలకు పైగానే 15 ఏండ్లు పైబడిన వెహికల్స్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు10 లక్షల పాత వెహికల్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. రవాణా శాఖ అధికారికంగా ఈ లెక్కలు తీసే పనిలో నిమగ్నమైంది.
పొల్యూషన్తో పాటు నేరాల కట్టడి..
వెహికల్ స్క్రాప్ పాలసీతో ఇటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయడమే కాకుండా అటు నేరాలను కూడా బాగా తగ్గించవచ్చని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కొందరు పాత వెహికల్స్ ను ఇతరులకు అమ్మి కొత్తవి కొంటుంటారు. కానీ పాత వెహికల్ ను కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయరు. దీనివల్ల పాత వాహనాలు మూడు, నాలుగు చేతులు మారినా అవి ప్రస్తుతం నడుపుతున్న వారి పేరిట కాకుండా వేరేవాళ్ల పేర్ల మీద ఉంటున్నాయి. ఇలాంటి బండ్లపై వచ్చి దొంగలు చైన్ స్నాచింగ్ లు, ఇతర నేరాలకు పాల్పడితే ఆ వెహికల్స్ నెంబర్ల ఆధారంగా క్రిమినల్స్ ను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. ఆ వాహనాల ఓనర్ల అడ్రస్ లకు వెళ్లి ఆరా తీస్తే తాము ఆ బండ్లను ఎప్పుడో అమ్మేశామని, ప్రస్తుతం ఎవరి వద్ద ఉందో కూడా తెలియదని చెప్తున్నారు. అయితే, ఆర్వీఎస్ఎఫ్ పాలసీ అమలులోకి వస్తే ఇకపై 15 ఏండ్లు దాటిన పాత వెహికల్స్ ను స్క్రాప్ కు వేయడం తప్ప అమ్మేందుకు అవకాశం ఉండదు. ఆ వెహికల్ తప్పనిసరిగా రవాణా శాఖ రికార్డుల్లో ఉంటుంది. దీని వల్ల ఇటు కాలుష్యం, అటు నేరాలు రెండూ తగ్గుతాయని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరిలోపే ఈ పాలసీ అమలు కావచ్చని అధికారులు చెప్తున్నారు.
సర్టిఫికెట్ ఆధారంగా 10% డిస్కౌంట్
పాత వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చడం వల్ల ఆ వెహికల్స్ ఓనర్లకు కొంత మేలు జరిగేలా కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. పాత వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చినప్పుడు వచ్చే ఇనుప తుక్కుకు ఎన్ని కిలోలు అయితే అంత మొత్తానికి మార్కెట్ రేటు ప్రకారం ధరను చెల్లించనున్నారు. అలాగే వెహికల్ ఓనర్ కు ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అతడు కొత్త వెహికల్ ను కొనేటప్పుడు ఈ సర్టిఫికెట్ చూపిస్తే 10 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.