పెళ్ళయ్యి.. 20 రోజులు కాలేదు..
పసుపు పారాని ఆరక ముందే మృత్యు ఒడిలోకి..
భర్తే చంపేసాడంటున్న బంధువులు..
ముక్తేశ్వరం – తొత్తరమూడి, బాలయోగి కాలనీకి చెందిన యువతి హైదరాబాద్ లో మృతి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 13: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే ఓ వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తన భర్త గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి నా సోదరి చనిపోయిందని అయినవిల్లి మండలం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన మృతురాలి సోదరుడు కుడిపూడి రమేష్ బలంగా అరోపిస్తున్నాడు.
వివరాల్లోకెళితే అయినవిల్లి మండలం తొత్తరమూడి బాలయోగి కాలనీకి చెందిన కుడిపూడి రమ్య సత్యప్రియకు ఆగష్టు 18 వ తేదీన అమలాపురం రూరల్ మండలం వేమవరం – నామాల వారి పాలెంకు చెందిన కొప్పిశెట్టి వెంకట సాయితో వివాహం అయ్యింది. వెంకట సాయి హైదరాబాదు పఠాన్ చెరువులో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి తొత్తరమూడిలో బట్టల షాపులో పనిచేసేది. పెళ్లైన తరువాత తొలిమాటు, అప్పగింతల వరకూ ఇరువురి బంధువుల మధ్య అన్నీ సవ్యంగానే జరిగాయి. తరువాత అమ్మాయి తల్లిదండ్రులు గత నెల 30వ తేదీన చివరి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతానికి పంపమని అబ్బాయిని కోరడంతో లేనిపోని సాకు చెప్పి రాత్రికి రాత్రే హైదరాబాద్ తీసుకువెళ్లిపోయాడని సోదరుడు రమేష్ తెలిపాడు. అక్కడికి వెళ్ళి నా సోదరి ఫోన్ చేసే వరకూ హైదరాబాదు తీసుకెళ్ళిన సంగతి నాకు తెలియదని చెప్పాడు. అనంతరం వారం రోజులు ఫోన్లో మాట్లాడేదని అదికూడా అమ్మాయికి ఫోన్ ఇవ్వకుండా వాళ్ళ ఫోన్ నుంచే మాట్లాడించే వారన్నారు. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ గత మూడు రోజుల నుంచీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని తిరిగి నాకు ఫోన్ చేసి ఏమి తెలియనట్లు మీ చెల్లికి ఏమైనా అనారోగ్యం ఉందా అని అడిగారని సోదరుడు రమేష్ తెలిపాడు. ఈ నెల 10 వ తేదీన మంగళవారం ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని చెప్పారని కన్నీటి పర్యంత మయ్యాడు. కావాలనే నా చెల్లిని భర్త వెంకట సాయి, ఆడపడుచు కలిపి చంపేసారని రమేష్ ఆరోపిస్తున్నాడు. మృతదేహాన్ని రేపు స్వగ్రామం తొత్తరమూడి తీసుకువస్తున్నట్లు రమేష్ తెలిపారు. నా చెల్లెలు మృతి పట్ల పలు అనుమానాలున్నాయని మాకు న్యాయం చేయాలని మృతురాలి సోదరుడు రమేష్ కోరుతున్నాడు.