ఇప్పుడిస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదు..
ప్రజారోగ్యానికి ఇచ్చే గ్రాంట్లనూ పెంచాలి..
ఫోర్త్ సిటీకీ నిధులివ్వాలని వినతి..
అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో ప్రజాభవన్లో పనగరియా టీమ్ భేటీ..
రాష్ట్ర ఆర్థిక అవసరాలపై పనగరియాతో చర్చించిన సీఎం రేవంత్రెడ్డి..
రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం ఉండొద్దు..
కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి..
విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్లైన్స్ను మార్చాలి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/10 సెప్టెంబర్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున ఎక్కువ నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, ప్రజారోగ్యానికి, విపత్తు నిర్వహణకు ఇచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదని స్థానిక సంస్థలకు ఇప్పుడిస్తున్న గ్రాంట్ ను నాలుగైదు రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఏటా కనీసం రూ.40 లక్షలు వచ్చేలా ఫండ్స్ ఇవ్వాలని, అప్పుడే గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపింది. రాష్ట్ర మ్యాచింగ్ ఫండ్స్తో సంబంధం లేకుండా ఆ నిధులు కేటాయించాలని కోరింది.
రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్ లో పంచాయతీరాజ్, మున్సిపల్, హెల్త్, విపత్తు నిర్వహణ అధికారులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయిలో సమావేశమైంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడి అధికారులు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఇతర కార్యక్రమాలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఫోర్త్ సిటీకి నిధులివ్వండి..
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని నెలకొల్పుతున్నదని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించేలా సిఫారసు చేయాలని అధికారులు కోరారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని డెవలప్ అయిన స్టేట్‌గా గొప్పలు చెప్పుకున్నదని, కానీ ఇప్పటికీ డెవలపింగ్ స్టేట్‌గానే ఉన్నదని, ఆ రకంగానే తెలంగాణను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని రుణగ్రస్తంగా మార్చిందని ఆ అప్పుల్ని, వాటి మీద వడ్డీలను తీర్చే బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీదపడిందని అధికారులు వివరించారు.
రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న అప్పుల భారం, వాటి మీద కడుతున్న వడ్డీలు, రాబోయే పదేండ్ల వరకూ ఖజానాపై పడే ఒత్తిడిని గణాంకాలతో కేంద్ర ఆర్థిక సంఘానికి అధికారులు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తమ అభిప్రాయాలను వెల్లడించారు. సీపీఎం తరఫున నంద్యాల నరసింహారెడ్డి, టీడీపీ తరఫున సామా భూపాల్ రెడ్డి, ఎన్ దుర్గాప్రసాద్, బీఎస్పీ నుంచి జనత్ కుమార్, ఈశ్వర్, మజ్లిస్ పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అమీన్ జాఫ్రీ, బలాల, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుధాకర్, బుర్రా రేణు గౌడ్, అబ్బాస్ అహ్మద్ కమిషన్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
ఆ అప్పులను కేంద్రమే తీర్చాలి: హరీశ్
ప్రజా భవన్ లో నిర్వహించిన కేంద్ర 16వ ఆర్థిక సంఘం సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద హాజరై బీఆర్ఎస్ పార్టీ తరఫున పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం మీడియాతో హరీశ్రావు మాట్లాడుతూ పన్నుల వాటా 41శాతం పెంచారని, కానీ 31 శాతం నిధులే వస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్థిక సంఘానికి వివరించినట్లు తెలిపారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్ చార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నారని ఈ డబ్బును వాటా ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తెలిపారు.
ఓబీసీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి: ఈటల
16 వ ఫైనాన్స్ కమిషన్ ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు బీజేపీ తరఫున ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్రెడ్డి హాజయ్యారు. మీటింగ్ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ 2014న ప్రధానమంత్రిగా మోదీ వచ్చాక రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ఉందని మొదటి నీతి అయోగ్ మీటింగ్ లోనే చెప్పారని తెలిపారు.
దానికి తగ్గట్టు టాక్స్ డెవల్యూషన్ 32శాతం నుంచి 42 శాతానికి పెంచి రాష్ట్రాలను అభివృద్ధి చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు 2.9 శాతం ట్యాక్స్ షేర్ వస్తే 15 వ ఆర్థిక సంఘం 2.43 ట్యాక్స్ షేర్ ఇచ్చిందని, ఇప్పుడు అది 2.1 గా మారిందని తెలిపారు. తెలంగాణలో 89 శాతం వీకర్ సెక్షన్ ప్రజలున్నారని, ఓబీసీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.
పనగరియాతో సీఎం భేటీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఫైనాన్స్ కమిషన్ బృందానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి సెక్రటేరియెట్లో విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అవసరాలపై వారితో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, కేంద్రం నుంచి అందుతున్న సహకారం, ఇంకా పెరగాల్సిన నిధుల విడుదల, డెవల్యూషన్ ఫార్ములతో ఎదురవుతున్న చిక్కులు, ఫార్ములా మార్చాల్సిన అవసరం తదితర అనేక అంశాలపై అరవింద్ పనగరియాతో సీఎం చర్చించారు.