హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ విజన్‌ను ప్రతిబింబించేలా ప్రసంగించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ‘‘సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు థ్యాంక్స్. దేశంలోని మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే డిమాండ్ చేశాం. కరోనా క్లిష్ట సమయంలో సెంట్రల్‌విస్టా కంటే మౌలిక సదుపాయాలు ముఖ్యమని చెప్పాం. కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టొద్దని.. రైతులు, కూలీలు, నిరుద్యోగులను పట్టించుకోవాలని పోరాడాం’’ అని కవిత ట్వీట్ చేశారు. దేశంలో భిన్నత్వాన్ని రాజ్యాంగం ప్రతిబింబిస్తోందని మరో ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతీ అంశాన్ని బలపరచడం భారతీయులందరి బాధ్యత అన్నారు.