తెలంగాణ లో భారీ వర్షాలతో రూ.5438 కోట్ల నష్టం..!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు అల్లాడి పోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పంట పొలాలపై ఇసుక మేటలు వేసింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడి పంటలు మునిగిపోయాయి. అలాగే చాలా చోట్ల రోడ్లు దెబ్బ తిన్నాయి. పలు చోట్ల వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలతో రూ.5438 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సీఎంవో ఒక ప్రకటన చేసింది. వర్షాలతో రోడ్లు భారీగా దెబ్బ తిన్నాయని రోడ్లు భవనాల శాఖ పేర్కొంది. రోడ్ల దెబ్బతినడంతో రూ.2,362 కోట్లు నష్టం జరిగినట్లు వివరించారు. స్తంభాలు విరిగిపోవడం. వైర్లు తెగిపోవడంతో విద్యుత్ శాఖ కూడా నష్టపోయింది. విద్యుత్ శాఖకు రూ. రూ.175 కోట్ల నష్టం వాటినట్లు అంచనా వేశారు. పంటలు దెబ్బతినడం రూ.415 కోట్లు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట అంచనా ఇంకా పెరిగే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖకు రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధికి రూ.170 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.25 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు రూ.1150 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఎకరాకు రూ.10 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.