తల్లిదండ్రుల గుర్తింపు..గుర్తించిన స్థానికులు..
సీహెచ్‌సీకి తరలింపు..శిశువు క్షేమం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్: హాయిగా తల్లి పొత్తిళ్లలో భరోసాతో నిద్ర పోవాల్సిన పురిటి శిశువు బొడు ఊడకుండానే ముళ్ల కంప పాలైంది. ఆడపిల్ల పుట్టిందనో, సాకలేమన్న ఆర్థిక పరిస్థితితో తెలియదు. కాని, తొమ్మిది నెలలు మోసిన బిడ్డను తల్లి కొన్ని క్షణాల్లోనే నిర్దయగా పాలీథిన్ కవర్‌లో చుట్టి, ముళ్లకంపల్లో పడేసింది. వెంటనే గుర్తించిన స్థానికులు చేరదీసి, ఆస్పత్రికి తరలించడంతో పురిట్లోనే పందులు, కుక్కలు లేదా విష పురుగుల బారినపడి మృతి చెందాల్సిన శిశువు లోకాన్ని చూడగలిగింది.
ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గౌడవెల్లి గ్రామ పరిధిలో రైల్వేగేట్ అవల ఉన్న ముళ్ల పొదల్లో శిశువు అరుపులు వినిపించగా, అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించాడు. లోపలికి వెళ్లి చూడా బొడ్డు కూడ ఊడని ఆడ శిశువు పాలిథిన్ కవర్‌లో చుట్టి పడేసినట్టు గుర్తించాడు. వెంటనే పక్కనే హోటల్‌ను నిర్వహిస్తున్న లక్ష్మి చెప్పాడు. వారు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు.
ఆయన ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంకు తీసుకొని హుటాహుటీనా ఘటనా స్థలికి వెళ్లాడు. అందరూ కలిసి ఆ శిశువును ముళ్ల పొదల్లో నుంచి జాగ్రత్తగా బయటకు తీశారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శిశువు తల, చెక్కిళ్లకు అంటుకున్న చీమలను తొలగించడంతో ప్రథమ చికిత్స అందించి, మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులతో పాటు సీడీపీవోకు సమాచారం అందించారు. సీడీపీవో శారద శిశువును ఆరోగ్య కేంద్రానికి తరలించేలోపే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వైద్యులు పాపకు తగిన వైద్యం అందించారు.
తల్లిదండ్రుల గుర్తింపు..
ముళ్ల పొదల్లో పురిటి శిశువును పడవేసిన ఘటనపై ఆరా తీయగా, పలువురు స్థానికేతరులు కోళ్ల ఫారంలో కార్మికులుగా పని చేసే తులసి(18), సంతోష్(17) గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారిని పిలిపించి గట్టిగా మందలించడంతో తమ శిశువు అని ఒప్పుకున్నారు. నివాసం ఉన్న చోటనే ప్రసవించిన తులసి కొద్ది క్షణాల్లోనే ముళ్ల పొదల్లో పడవేసినట్టు స్థానికులు, పోలీసులు గుర్తించారు. సంతోష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, తులసిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తులసి బిడ్డకు పాలిచ్చేలా చర్యలు తీసుకున్నారు.