చెరువులను తలపిస్తున్న పొలాలు..

Get real time updates directly on you device, subscribe now.

రాష్ట్రంలో పంట నష్టం 5 లక్షల ఎకరాల్లో..! పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం..!!
చెరువులను తలపిస్తున్న పొలాలు..
ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 లక్షల ఎకరాలు మునక..
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పత్తి పంటపై ప్రభావం..
సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాలపై ఎఫెక్ట్..
వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/02 సెప్టెంబర్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పంటలు ఆగమైనయ్. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నరు. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో వరద నీళ్లు పొలాల్లోకి చేరాయి. ప్రధానంగా పత్తి, మిరప, వరి, మక్క పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు 4లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు తెలుస్తున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతున్నది. సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, వనపర్తి, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వానాకాలం సీజన్ ప్రారంభమై మూడు నెలలైంది. పత్తి కాత దశలో ఉండగా పెసర చేన్లు చాలా వరకు చివరి దశలో ఉన్నాయి. వరి పొలాలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. ముందస్తు నాట్లు వేసిన ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

మున్నేరు పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం

మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో వేసిన పంటలు, వరి నాట్లు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, నిడమనూరు, దామరచర్ల, డిండీ, వేములపల్లి, కేతేపల్లి, తిరుమలగిరి, సాగర్ త్రిపురారం, నకిరేకల్, పెద్దవూర, అడ్డగూడురు, తుంగతుర్తి మండలాల్లో పంటలు తీవ్ర ప్రభావితం అయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, మొలుగుమాడు, నర్సింహాపురం, మధిర మండలాలు, వంగవీడు, కిష్టాపురం తదితర గ్రామాల్లో పత్తి, మిర్చి, వరి, మక్క పంటలు నీటమునిగాయి. చాలా చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. సూర్యాపేట జిల్లా కోదాడ, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

నీట మునిగిన పంటలు

ఈ ఏడాది 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, ఇప్పటికే 1.09 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇప్పటి దాకా 42.66 లక్షల ఎకరాల్లో పత్తి, 4.60 లక్షల ఎకరాల్లో కంది, 66వేల ఎకరాల్లో పెసర, 4.88 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 47.81 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలకు పంటలు నీట మునిగాయి.

తీవ్రంగా ప్రభావితమైన ఖమ్మం జిల్లా

ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 4.08 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లాల్లో సాగైన 2.84 లక్షల ఎకరాల్లోని పంటల్లో పావు వంతు పంటలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నరు. సూర్యాపేట జిల్లాల్లో సాగైన 3.32 లక్షల ఎకరాల పంటల్లో చాలా వరకు నీటి మునిగాయి. మున్నేరు, పాలేరు తదితర వాగులు, చెరువులు ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దెబ్బతిన్న పత్తి పంట

వానాకాలంలో పత్తి సాగు లక్ష్యం 60లక్షల ఎకరాలు కాగా, ఈయేడు 42.66 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. పొలాల్లో నీరు చేరడంతో కాత దశలో ఉన్న పత్తి చేన్లు నీటిలో మునిగాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment