కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం
15 మంది మృతి.. ఐదుగురికిపైగా గల్లంతు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం
ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 110 గ్రామాలు
మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో 10 అడుగుల మేర వరద
నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధం
మహబూబాబాద్ జిల్లాలో రెండుచోట్ల..
సూర్యాపేట జిల్లాల్లో ఒకచోట కోతకు గురైన రైల్వే ట్రాక్
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు మూడు చోట్ల గండ్లు
మునిగిన భక్తరామదాసు పంపుహౌస్
పెద్దవాగు నూతన రింగ్ బండ్ కు గండి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/02 సెప్టెంబర్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం విలయం సృష్టించింది. మిన్నుమన్నూ ఏకమైనట్లుగా కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల ముంపు ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పోటెత్తి ఖమ్మం నగరాన్ని ముంచింది.15 కాలనీల్లో ఇళ్లు మునిగాయి. మహబూబాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కేంద్రం నీటి మునిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నె- కేసముద్రం స్టేషన్ల మధ్య కిలోమీటరు మేర, మహబూబాబాద్-తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య సుమారు 300 మీటర్ల మేర ట్రాక్ కోతకు గురైంది. ఈ మార్గంలో 24 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద రైలు పట్టాల కింద కట్ట కోతకు గురైంది. రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు, ఈదురుగాలులకు ఇళ్లు, గోడలు, చెట్లు కూలాయి.
నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో పలుచోట్ల సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామ చంద్రాపురంలో 132.5 కి. మీ. వద్ద ‘సాగర్’ ఎడమ కాల్వకు భారీ గండి పడింది. ఖమ్మం జిల్లా పరిధిలోనూ నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 15 మంది మృతి చెందగా ఐదుగురికి పైగా గల్లంతయ్యారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై అనేక చోట్ల వరద చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు.
Related Posts