తక్షణం విధుల్లో చేరండి : టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/01 సెప్టెంబర్: రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది సెలవులు అన్నీ రద్దు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీ ముషారఫ్ ఫారూఖీ ప్రకటించారు. సెలవుల్లో ఉన్న ఉద్యోగులు తక్షణం విధుల్లో చేరాలనీ ఆదేశించారు. శుక్రవారం అర్థరాత్రి ఆయన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సిబ్బంది అందరూ తమ తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి సర్కిల్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలనీ, స్థానిక కలెక్టర్ కార్యాలయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎమ్‌సీ) అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అధికారులు తమ పరిధిలోని ఫ్యుజ్ ఆఫ్ కాల్, సీబీడీ కార్యాలయాలకు వెళ్లి, సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఎస్‌ఈ, డీఈ స్థాయి అధికారులు ప్రతి గంటకు విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది తప్పనిసరిగా అన్ని భద్రతా చర్యలను పాటించాలని చెప్పారు. ముంపు భయం ఉన్న లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు తడిచిన విద్యుత్ స్తంభాలు, ఇతర పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే 1912 కి లేదా సమీప విద్యుత్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి తెలపాలని చెప్పారు.