తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవు..
కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలంగాణలో ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ..!!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/01 సెప్టెంబర్: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు హైదారాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయు గుండమై తీరం దాటనుంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో 29 సెంచీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 20 సెంటీమీటర్లు, మహబూబాబాద్‌లో 16.9 సెంటీమీటర్లు, నెక్కొండలో 25.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
తెలంగాణలో ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ..!!
అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట్, గద్వాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇక కొమురం భీమ్, ములుసు భద్రాద్రి, వరంగల్, ఖమ్మం, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది.