రాష్ట్రానికి రెడ్ అలర్ట్.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ 01 సెప్టెంబర్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది.
దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్‌పూర్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందన్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం నాడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాగా, ఇప్పటి వరకు నారాయణపేటలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలివే..
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపెట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.