హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరబాద్: రాజ్యాంగ పదవి హుందాతనాన్ని, గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినట్టు విమర్శలు ఎదుర్కొంటున్న తమిళిసై.. పుదుచ్చేరిలోనూ తెలంగాణపై అదే ధోరణి ప్రదర్శించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై బురద చల్లేందుకు ఆమె మరోసారి యత్నించారు. తెలంగాణపై కేంద్రానికి రిపోర్టు ఇచ్చానంటూ వ్యాఖ్యానించారు.
రాజ్‌భవన్‌ను రాజకీయభవన్‌గా మార్చారంటూ ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటున్న గవర్నర్ తమిళిసై గణతంత్ర వేడుకల్లో మరోసారి వివాదంలో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిన ప్రసంగంలో.. ఫక్తు రాజకీయ నేతగా మాట్లాడారు. అభివృద్ధికి పెడార్థాలు తీస్తూ తన రాజకీయ దురుద్దేశాలను బయటపెట్టుకునే ప్రయత్నం చేశారు.
గవర్నర్ తీరుపై ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు మండిపడుతున్నారు. ‘భవనాలు నిర్మించడం అభివృద్ధి కాదు. జాతి నిర్మాణం ముఖ్యం’ అంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పాలనాసౌలభ్యం కోసమే నూతన కార్యాలయాలని, అభివృద్ధికి అవికూడా సూచికలేనని చెప్తున్నారు. జాతి నిర్మాణంలో అవి కూడా భాగమేనని స్పష్టంచేస్తున్నారు. మరి, సెంట్రల్ విస్టా పేరుతో భవనాలను నిర్మిస్తున్న ప్రధాని మోదీ సంగతేందని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణపై జరుగుతున్న కుతంత్రం గణతంత్ర దినోత్సవం సాక్షిగా బట్టబయలైంది. రిపబ్లిక్‌డే రోజున రాజ్యాంగబద్ధ పదవిని గవర్నర్ తమిళిసై అవమానించారు. గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ఫక్తు రాజకీయ నాయకురాలిగా, ప్రతిపక్ష నేతగా మారిన తమిళిసై.. తన ప్రసంగంలో తెలంగాణ ప్రగతిపై అడుగడుగునా విద్వేషం వెళ్లగక్కారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మరిచి, ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు.
అన్నింటినీ మించి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ పేరునుగానీ, రాష్ట్ర ప్రభుత్వం పేరును గానీ ప్రస్తావించని గవర్నర్.. రాష్ట్ర పుట్టుకను అవమానించి, మొదటి నుంచీ తీరని ద్రోహం చేస్తున్న మోదీని మాత్రం పొగిడారు. సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పథకాలు పట్టని గవర్నర్.. రోడ్లు, రైళ్లు ఇచ్చారంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలపై రాజ్యాంగ నిపుణులు నోరెళ్లబెడుతుండగా.. తెలంగాణ ప్రజలు, మేధావులు, విశ్లేషకులు ఆ పదవికే కళంకం తెచ్చారంటూ మండిపడుతున్నారు. మరోవైపు తమిళిసై పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో చేసిన ప్రసంగంలో మాత్రం పూర్తిగా ఆ రాష్ట్ర ప్రగతి గురించే మాట్లాడటం గమనార్హం. తెలంగాణలో ఒక విధంగా, పుదుచ్చేరిలో మరోవిధంగా మాట్లాడటం ఏమిటని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
‘భవనాలు నిర్మించడం అభివృద్ధి కాదు. జాతి నిర్మాణం ముఖ్యం’అంటూ గవర్నర్ ప్రసంగంలో వ్యాఖ్యానించటంపై మేధావులు మండిపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలన్నీ ప్రజల కోసమేనని, ఆమె ఉంటున్న రాజ్‌భవన్ కూడా ఎవరో ఒకరు నిర్మించకపోతే.. ఎక్కడ ఉండేవారని ప్రశ్నిస్తున్నారు. కొత్త గ్రామాల్లో, మండలాల్లో శాశ్వత పంచాయతీ భవనాలు, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం ప్రజల కోసం కాదా?అని నిలదీస్తున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్మించడాన్ని గుర్తుచేస్తున్నారు. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడిలో 9,123 పాఠశాలలను రూ.3,497 కోట్లతో అభివృద్ధి చేస్తున్నదని, కొత్త భవనాలు నిర్మిస్తున్నదని.. ఇవన్నీ జాతి నిర్మాణంలో భాగం కాదా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. పేదలకు ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తున్నదని, ఇది ఎవరి కోసమని అడుగుతున్నారు. ప్రభుత్వం నిర్మించే నూతన సచివాలయ నిర్మాణంపై గవర్నర్‌కు అంత కండ్లమంట ఎందుకని నిలదీస్తున్నారు. ‘సుపరిపాలన అనేది రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచిక. రాష్ట్రంలో పంచాయతీ భవనాలు మొదలు రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి నిర్మాణం సుపరిపాలన కోసమే. తెలంగాణలాంటి కొత్త రాష్ట్రంలో ఇది మరింత అవసరం కూడా. ఈ నిర్మాణాలే ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంతోపాటు అభివృద్ధికి బాటలు వేస్తాయి’ అని పలువురు విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.
సచివాలయంపై అక్కసు వెళ్లగక్కిన గవర్నర్‌కు.. ప్రధాని మోదీ ఢిల్లీలో సెంట్రల్ విస్టా పేరుతో కడుతున్న భవన నిర్మాణాలు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.17వేల కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణాలు చేపట్టారని.. ప్రధాని నివాసానికే రూ.400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ భవనాలపైనా ఇలాగే వ్యాఖ్యానిస్తారా? అని గవర్నర్‌ను నిలదీస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా గవర్నర్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఎవరి మెప్పుకోసమో పనిచేయాల్సిన అవసరం తమకు లేదని, తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల మేలు కోసం బరాబర్ భవనాల నిర్మాణం చేపడుతామని స్పష్టంచేస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం అందించే సాయంపైనా గవర్నర్ విషం కక్కటంపై మండిపడ్డారు.
‘రాష్ట్రంలో కొంతమందికి ఫామ్‌హౌస్‌లు ఉండటం కాదు.. వ్యవసాయ క్షేత్రాలు బాగుండాలి..’ అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం మండిపడుతున్నది. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని రైతులు గుర్తుచేస్తున్నారు. రైతుబంధు, పంటకొనుగోళ్ల ద్వారానే రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.1.65 లక్షల కోట్లు వేశారని చెప్తున్నారు. కేంద్రం రైతులను ముంచేలా నల్లచట్టాలను తెచ్చింది వాస్తవం కాదా? అని గవర్నర్‌ను ప్రశ్నిస్తున్నారు. ’13 నెలలు రైతులను అవస్థలు పెట్టి, 750 మంది మరణాలకు కారణమైంది ఎవరో.. చివరికి రైతులకు క్షమాపణ చెప్పింది ఎవరో.. మీకు తెలియదా? తెలంగాణలో పండిన పంటను కొనుగోలు చేయలేమని కేంద్రం చేతులెత్తేసిన సంగతి మర్చిపోయారా?’అని రైతులు మండిపడుతున్నారు.
‘రాష్ట్రంలో రోజుకు 22మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి..’ అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపైనా విశ్లేషకులు, విషయ నిపుణులు మండిపడుతున్నారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం చూస్తే 2021లో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో బీజేపీ పాలిత మహారాష్ట్ర 13.5 శాతంతో అగ్రస్థానంలో, మధ్యప్రదేశ్ 9.1 శాతంతో మూడో స్థానంలో, కర్ణాటక 8 శాతంతో ఐదో స్థానంలో ఉన్నదని గుర్తుచేస్తున్నారు. దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో తెలంగాణలో 6 శాతమే ఉన్నాయని చెప్తున్నారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో 5.4 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయని అన్నారు. అయినా ఆయా రాష్ర్టాల గురించి ఎందుకు మాట్లాడట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి గానీ, పథకాల అమలు గురించి గానీ, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం గురించిగానీ గవర్నర్ తన ప్రసంగంలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కానీ జాతీయ రహదారులకు నిధులు ఇస్తున్నారంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి, ప్రధానిని పొగడటాన్ని బట్టి కేవలం బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే, ఫక్తు రాజకీయ నాయకురాలిగా ఆమె మాట్లాడిందని స్పష్టంచేస్తున్నారు. తెలంగాణ పుట్టుకనే మోదీ అవమానించిన విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక నిధులు విడుదల మొదలు ప్రాజెక్టులకు అనుమతులు, విభజన హామీల అమలు, చివరికి వడ్ల కొనుగోలులోనూ కొర్రీలు పెట్టింది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. తనకు తెలంగాణపై ప్రేమ ఉన్నదని ప్రసంగంలో కపట ప్రేమను ప్రదర్శించిన గవర్నర్.. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ.8,995 కోట్లు బకాయిలు విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. నీతిఆయోగ్, 14, 15వ ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం, ఇతర పద్దుల కింద రూ.34,149 కోట్లు రాష్ర్టానికి రావాల్సి ఉన్నదని, తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే గవర్నర్ వాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా విభజన హామీల కోసం కొట్లాడాలని, అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలని బుద్ధిజీవులు సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా గవర్నర్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించలేదు. పైగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు మీద కడుతున్న తెలంగాణ సచివాలయ నిర్మాణాన్ని పరోక్షంగా దెప్పిపొడిచారు. పైగా కేంద్రాన్ని పొగిడారు. ఇది తెలంగాణను అవమానించడం కాక మరేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే పనిని రాష్ట్రపతి చేస్తే ఎలా ఉంటుంది? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కాకుండా.. ప్రధాని మోదీ ఈ దేశంపై రూ.100 లక్షల కోట్ల అప్పు మోపాడని, పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలను అతలాకుతలం చేశాడని, రాష్ర్టాల అధికారాలను గుంజుకుంటున్నాడని, సెస్సులతో రాష్ర్టాల ఆదాయానికి గండి కొడుతున్నారని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ తన కార్పొరేట్ దోస్తులకు కట్టబెడుతున్నారని, పైగా వాళ్లకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, సాగు చట్టాలతో 750 మంది రైతుల ప్రాణాలను బలిగొన్నారని, విద్యుత్తు చట్టం పేరుతో బాయికాడ కరెంటు మీటర్లు పెడుతున్నారని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఆశ కల్పించి యువతను మోసం చేశారని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషం పెంచుతున్నారని, పాకిస్థాన్, చైనాలను బూచిగా చూపి రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారని, అవసరం లేకున్నా సెంట్రల్ విస్టా పేరుతో రూ.17 వేల కోట్లు వృథా చేస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో 8 రాష్ర్టాల్లో అడ్డదారిన అధికారంలోకి వచ్చారని, ఇలాగే కొనసాగితే దేశంలో వన్ పార్టీ.. వన్ లీడర్ అనే రాచరిక పాలన వస్తుందని.. రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని మేధావులు పేర్కొంటున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి అని, దానికి మర్యాద ఇస్తూ, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని, అలా కాకుండా బీజేపీ ఎజెండా అమలు చేస్తానన్నట్టుగా, సమాంతరంగా మరో వ్యవస్థను నడుపుతానన్నట్టుగా గవర్నర్ వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేస్తున్నారు. రాజకీయ నాయకురాలిగా ఆమె ఫెయిలయ్యారని, కాళ్లకు బలపం కట్టుకొని తిరిగినా తమిళనాడు ప్రజలే నమ్మలేదని గుర్తుచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ 8 ఏండ్లలోనే తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానానికి చేర్చడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎలాగైనా అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక కొర్రీలు పెడుతున్నారు. దీంతోపాటు ప్రధాని మోదీ పాలనలోని తప్పులను సీఎం కేసీఆర్ ఎత్తిచూపడాన్నీ వారు తట్టుకోలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించడం, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం, బీజేపీ ప్రత్యామ్నాయమని ప్రజల్లో భావన బలపడుతుండటంతో ఢిల్లీ పెద్దలు హడలిపోతున్నారు. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర.. ఇలా పలు రాష్ర్టాల నుంచి వరుసగా నేతలు బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతుండటంతో కుర్చీ కిందికి నీళ్లు వస్తున్నాయని గ్రహించారు. గతంలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొని విఫల ప్రభుత్వంగా ముద్ర వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రగతిని చిన్నబుచ్చడానికి, సీఎం కేసీఆర్ పరపతిని తగ్గించడానికి కుట్రలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని దేశం మొత్తం తెలుసని, ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేసిందని గుర్తుచేస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఎట్‌హోంకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రమే హాజరయ్యారు. దీంతో బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్ సైతం గవర్నర్ తీరుకు నిరసన తెలిపినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్నా.. బండి సంజయ్ మాత్రమే హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లినా తెలంగాణపై విమర్శలు కొనసాగించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. తెలంగాణలో చట్టం, న్యాయ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కేంద్రా నికి రిపోర్ట్ ఇచ్చానని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. దీనిపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. వేరే రాష్ర్టానికి వెళ్లి తెలంగాణను అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.