డాన్‌గా ఎదగాలనే..

Get real time updates directly on you device, subscribe now.

డాన్‌గా ఎదగాలనే తుపాకీ కొన్నా..

గాజులరామారం కాల్పుల నిందితుడు నరేశ్‌ ఒప్పుకోలు..

ఆయనతో సహా 15 మంది అరెస్ట్‌, రిమాండ్‌..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/క్రైం/31 ఆగష్టు: గాజులరామారం లోని ఓ బార్‌ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మల్లంపేట నరేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి నాటు తుపాకీ, 87 బుల్లెట్లు, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈనెల 27న అర్ధరాత్రి చేబ్రోలు పూర్ణిమ (35), అజయ్‌చంద్ర, గౌతమ్‌ బైక్‌పై మల్లంపేట నుంచి గాజులరామారం వస్తుండగా ఎల్‌ఎన్‌ బార్‌ వద్ద వీరి వాహనంలో పెట్రోల్‌ అయిపోయింది. బార్‌ వద్ద వాహనాల్లో పెట్రోలు తీస్తుండగా సిబ్బంది వారించారు. దీంతో ఘర్షణ పెరగగా, పూర్ణిమ నరేష్‌, శివలకు ఫోన్‌ చేసి త్వరగా రావాలని కోరింది.

దీంతో నరేశ్‌ తన గ్యాంగ్‌తో కలిసి బార్‌ వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. ఆవేశంలో నరేశ్‌ తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం పారిపోగా పోలీసులు గాలించి ప్రధాన నిందితుడు నరేశ్‌తోపాటు శివ, సోహెల్‌, శ్యాంసన్‌, నరేందర్‌, ఉజ్వల్‌ సహా 15 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డాన్‌గా ఎదగాలని, రియల్‌ వ్యాపారం చేస్తూ అడ్డొచ్చిన వారి భూములు లాక్కోవాలనే ఉద్దేశంతో తుపాకీ కొనుగోలు చేసినట్టు నరేష్‌ అంగీకరించాడు. ఆయనపై త్వరలో రౌడీషీట్‌ ఓపెన్‌ చేసి, పీడీ యాక్టు పెడతామని డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ హన్మంతరావు, ఎస్‌వోటీ సీఐ శ్యామ్‌సుందర్‌, జీడిమెట్ల సీఐ మల్లేష్‌, ఎస్‌ఐ రవికిరణ్‌ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment