హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు..

Get real time updates directly on you device, subscribe now.

ఇకపై రెవెన్యూ నోటీసులే షోకాజ్‌ నోటీసులు – హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/30 ఆగష్టు: నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు నిమిత్తం రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. చెరువుల పరిరక్షణకు అక్రమ నిర్మాణాలపై జారీ చేస్తున్న రెవెన్యూ నోటీసులపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులపై పిటిషనర్లు అన్ని పత్రాలతో సహా ఆధారాలను అధికారులకు సమర్పించాలని వెల్లడించింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని స్పష్టం చేసింది.

పలు పిటిషన్లు దాఖలు : శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంలో 58.08 ఎకరాల్లో 280 ప్లాట్లతో వేసిన లేఔట్‌లో 1998లో ప్లాటు కొనుగోలు చేసి నిర్మించుకున్న ఇళ్లను తొలగించాలంటూ వాల్టా చట్టంలోని సెక్షన్ 23 కింద డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం : పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గుట్టలబేగంలో చేసిన లేఔట్‌లో 1998లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అన్ని అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలున్నాయని. వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేశారన్నారు. కావూరిహిల్స్‌లోని పలు అపార్ట్మెంట్ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయని వాటిని తొలగించాలంటూ ఈనెల 3న నోటీసులు జారీ చేశారన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు తెలిపారు.

హైకోర్టు విచారణ : ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలను తొలగించాలంటూ డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్లు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణిస్తామని, నిర్దిష్ట గడువులోగా పిటీషనర్లు వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో నిర్మాణాలు, అభ్యర్ధనలు వేర్వేరు అయినప్పటికీ, ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలోని నిర్మాణాలను తొలగించాలన్నదే నోటీసులో ప్రధానంగా ఉందని పేర్కొంది.

అంతేగాకుండా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా కూల్చివేత నోటీసులు ఇవ్వడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్లు జారీ చేసిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించి అధికారులకు అన్ని ఆధారాలను సమర్పించి వివరణ ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అదికారులను ఆదేశిస్తూ, పిటిషన్లపై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment