కవిత రిలీజయ్యే వరకూ బయటకు రాకూడదని అనుకున్నారా ?

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. రోజు రోజుకు కొత్త కొత్త కారణాలతో హైలెట్ అవుతున్నాయి.

ప్రస్తుతం హైడ్రా వ్యవహారం దుమారం రేగుతోంది.

అంతకు ముందు రుణమాఫీ విషయంలో కానీ ఆరు గ్యారంటీల విషయంలో కానీ బీఆర్ఎస్ లోని ఇతర నేతలు కాంగ్రెస్ సర్కార్ పై గట్టిగానే విరుచుకుపడుతున్నారు .

కానీ కమాండర్ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేశారు. కనీసం అందులో అయినా తన స్పందన వ్యక్తం చేయడం లేదు. పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. దీంతో  ఇతర పార్టీల నేతల్లోనే కాదు బీఆర్‌ఎస్ నేతల్లోనూ ఎందుకిలా అన్న ప్రశ్న వస్తోంది.

కవిత రిలీజయ్యే వరకూ బయటకు రాకూడదని అనుకున్నారా ?

బిడ్డ కవిత ఢిల్లీ జైల్లో ఉందని బయటకు ఇలా కనిపిస్తున్నా తన గుండెల్లో అగ్నిపర్వతం  బద్దలవుతోందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన బయట కనిపించలేదు. కవిత అరెస్టు కావడం సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంచడం వల్ల కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని బిడ్డను బయటకు తీసుకు వచ్చేందుకు ఆయన న్యాయపరమైన ఎన్నో ప్రయత్నాలు చేశారని అంటున్నారు. దేశంలోని టాప్ లాయర్లతో ఆయన మాట్లాడారని అంటున్నారు. ఈ అంశంపైనే నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారని అందుకే ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తికరంగా లేరని చెబుతున్నారు. కవితకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాతనే ఆయన బయటకు వస్తారని అంచనా వేస్తున్నారు.

రాజకీయాలు పూర్తిగా కేటీఆర్, హరీష్ కు అప్పగించినట్లేనా ?

రోజువారీ రాజకీయాలపై కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఆయన పార్టీ నేతలతో కూడా ఈ అంశాలపై మాట్లాడటం లేదని చెబుతున్నారు. రాజకీయ వ్యవహారాలు, వ్యూహాలను పూర్తిగా కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారని అంటున్నారు. అందుక కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలతో దాడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలాంంటి చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. అంగన్ వాడిల్లో పిల్లలకు ఇచ్చే గుడ్లు సరిగ్గా లేవని వస్తే దానిపైనా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇటీవల బీఆర్ఎస్ చేసిన రాజకీయ పోరాటాలకు కేటీఆరే నేతృత్వం వహించారు. కేసీఆర్ చిన్న స్పందన కూడా వ్యక్తం చేయలేదు. రుణమాఫీ అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అయినా కేసీఆర్ బయటకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆరోగ్యం బాగోలేదన్న ప్రచారం అందుకే !

సాధారణంగా కేసీఆర్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా తెరపైకి వస్తారని ఎవరైనా ఊహిస్తారు. కానీ ఆయన రాకపోయే సరికి బహుశా ఆరోగ్యం  బాగోలేదేమో అనే ప్రచారం ప్రారంభించారు. నిజానికి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకపోతే సంచనలం అయ్యేది. కానీ అలాంటి పరిస్థితి లేదని కేసీఆర్ బయటకు వచ్చేలా చేయడానికి పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారమని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేసీఆర్ బయటకు వచ్చే వరకూ ఈ తరహా ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. మంగళవారం కవితకు బెయిల్ వస్తుందని  బీఆర్ఎస్ ఆశాభావంతో ఉంది. ఆ తర్వాతైనా బయటకు వస్తారేమో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment