హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశాలిచ్చినా పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడమంటే ముమ్మాటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని మండిపడ్డారు. దేశంలో సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా రూపొందించిన అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? తలదించుకుని బానిసల్లాగా బతికే కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. అంబేద్కర్ స్పూర్తితోనే మోదీ భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ శక్తిగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గతంలో గవర్నర్లకు సాష్టాంగ నమస్కారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఉన్నత చదువు చదివిన మహిళా గవర్నర్ ను మాత్రం అవమానిస్తున్నారు అని విమర్శించారు.