గజ్వేల్ నుంచి కొడంగల్ కు..!!

Get real time updates directly on you device, subscribe now.

ఆర్‌ అండ్‌ బీ ఈఈ కార్యాలయం మార్పు !

మాజీ సీఎం నియోజకవర్గం నుంచి ప్రస్తుత సీఎం ఇలాకకు..

యాదాద్రి ఆర్‌ అండ్‌ బీ ఈఈ ఆఫీసు రాజేంద్రనగర్‌కు..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/ ఆగస్టు 25 : రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన అథారిటీల పరిధిలోని వివిధ శాఖల కార్యాలయాలు మరో ప్రాంతానికి మారబోతున్నాయి. వీటిల్లో గజ్వేల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (గడా) కింద ఆ ప్రాంత అభివృద్ధి కోసం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం గజ్వేల్‌లో ఉన్న ఈ కార్యాలయం త్వరలో కొడంగల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అఽథారిటీ (కడా)కు మారనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ పరిధిలోకి కార్యాలయం మారనుండడం ఆసక్తికర అంశం. అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట, పరిసర ప్రదేశాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డివిజన్‌ కార్యాలయం కూడా మరో ప్రాంతానికి మారనుంది. యాదాద్రి నుంచి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ దగ్గర నూతనంగా నిర్మితమవుతున్న హైకోర్టు భవనం ప్రాంగణానికి ఈ కార్యాలయం తరలనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోందని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం గడాను ఏర్పాటు చేశారు.

దాంతో పాటు మల్లన్నసాగర్‌, రంగనాయక్‌ సాగర్‌ సహా వివిధ ప్రాంతాలకు రోడ్ల అనుసంధానంతో పాటు ఇతర పనులు కలిపి దాదాపు రూ.500 కోట్ల మేర నిధులను మంజూరు చేశారు. ఆయా పనులన్నింటినీ పర్యవేక్షించేందుకు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గజ్వేల్‌లో ఈఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి కోసం మంజూరు చేసిన పనులన్నీ పూర్తయ్యాయి. అదే సమయంలో కడాకు వివిధ రకాల పనులతో పాటు, సమీకృత గురుకులాల నిర్మాణ పనులు కలిపి దాదాపు రూ.500 కోట్ల మేర పనులు మంజూరయ్యాయి.

ఈ నేపథ్యంలో కడాలో పనులు ఎక్కువగా ఉండడం, పైగా సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ప్రత్యేక కార్యాలయాన్నీ అక్కడ ఏర్పాటు చేయాలని శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఇక, యాదాద్రి ప్రత్యేక డివిజన్‌ కార్యాలయం పరిధిలో పనులు కొలిక్కి రావడంతోపాటు భారీ నిర్మాణాలు లేకపోవడంతో రాజేంద్రనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న హైకోర్టు భవన పనుల పర్యవేక్షణ నిమిత్తం అక్కడికి ఆ కార్యాలయాన్ని తరలించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment