ఆమె తన ఇష్టానుసారంగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు: హైకోర్టు – హైదరాబాద్..
తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలకు హక్కు ఉండదు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉండబోవనీ, దాన్ని తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకునే అధికారం ఆమెకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆస్థిపై హక్కులను ఆధారాలతో కోరాలేగానీ విభిన్న ప్రకటనలతో, ఊహాజనితంగా కోరేందుకు వీల్లేదని పేర్కొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంట్లో మూడో వంతు వాటాను ఇవ్వకుండా పెద్ద కుమారుడి పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ను డీడ్ చేసిన ఒక తల్లి చర్యను సివిల్ కోర్టు సమర్ధించింది. దీన్ని సవాల్ చేస్తూ భజరంగ్లాల్ అగర్వాల్ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను కొట్టేస్తూ జస్టిస్ మౌసమీ భట్టాచార్య. జస్టిస్ ఎంజి ప్రియ దర్శినిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషనర్ తరపు లాయర్ వాదిస్తూ, 1988లో తన క్లెయింట్ తండ్రి ఇంటిని కొనుగోలు చేసి ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. తండ్రి మరణానంతరం ముగ్గురు కొడుకుల పేరుతో విల్డీడ్ చేశారనీ, ఆ తర్వాత దాన్ని రద్దు చేసి పెద్ద కొడుకు రాజేంద్ర అగర్వాల్ పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయడం చెల్లదని వాదించారు. మూడో వంతు వాటా తన క్లెయింట్కు కూడా వస్తుందని అన్నారు. అయితే ఇది తల్లి సుశీల్ అగర్వాల్ స్వార్జిత ఆస్తి అని ఆమె తరపు లాయర్ వాదించారు. దీనిపై హైకోర్టు, తల్లి విల్డీడ్ చేసినప్పుడు సమర్ధించిన పిటిషనర్, దాన్ని రద్దు చేశాక అన్యాయమంటూ కోర్టుకు రావడాన్ని తప్పుపట్టింది. విల్ డీడ్లో ముగ్గురికీ వాటాలు ఇచ్చినప్పుడు తల్లికి హక్కులున్నాయని అంగీకరించిన పిటిషనర్, గిఫ్ట్ డీడ్ చేశాక తల్లికి హక్కులు లేవంటూ వాదించటం చెల్లదంటూ తేల్చి చెప్పింది. ఆస్థిని ఉమ్మడి కుటుంబ ఆస్థిగా ప్రకటించాలనే వాదన చట్ట వ్యతిరేకమని తేల్చింది. ఈ విషయంలో తల్లికే పూర్తి హక్కులు ఉంటాయని తీర్పు వెలువరించింది.