హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/ఆర్మూర్/24 ఆగష్టు: అదాని, అంబానీ టాటా బిర్లాలకు వందల కోట్ల మాఫీ మరి రైతన్నలకు రుణమాఫీ ఏది అంటూ శనివారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సెయింట్ పాల్ స్కూల్ దగ్గర రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు ప్రభాకర్, తిరుపతిరెడ్డి, లింగారెడ్డి, దేగం యాదగౌడ్, నూతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఏ లాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇప్పటికే జిల్లాల్లో కొద్దిమంది రైతులకు మూడు విడతలలో రుణం మాఫీ అయిందని, అనేక మందికి రేషన్ కార్డులలో పేరు లేకపోవడం, రుణం బకాయి ఎక్కువగా ఉందని, ఆధార్ బ్యాంకు ఖాతాల్లో పేర్లు వేరువేరుగా ఉన్నాయని కొర్రీలు పెడుతూ రైతన్నలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఏ పంట అయినా సరే 500 బోనస్, 15 వేల రైతు భరోసా సాధించుకోవాలని తెలంగాణ రైతాంగం ఏకమై ఐదు రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు. జక్రాన్ పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన ఓ రైతు ధరణి సమస్యతో అప్పులతో సతమతమై ఉరివేసుకొని చనిపోయినాడు అని ప్రతి పంటకు రెండు లక్షల రుణమాఫీ రైతు బీమా ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను మోసం చేయడం సరికాదని, రైతన్నలను రోడ్డుమీదికి తెచ్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రైతన్నలు నష్టపోయారని అన్నారు. రైతన్నలు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ లు మాట్లాడుతూ డిసెంబర్ 7న ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 9వ తేదీన అందరికీ రుణమాఫీ చేస్తానని అని రైతులను మోసం చేసినారని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు, ఎద్దు ఏడ్చిన యవసం బాగుపడలేదనీ ఒక్కరోజు అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అని అంటామని అలాంటి బువ్వ పెట్టే రైతులను ఏడిపిస్తే పుట్టగతులు లేకుండా పోతారని అన్నారు.
రైతుల కోసం రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని వాన కోసం మొగులుకు మొఖంపెట్టి చూసిండ్రు కాలమటే పోయింది. రుణమాఫీ అటే అయి పోయింది అని, ఉద్యమ గడ్డ ఏ ఉద్యమం చేసిన ఆర్మూర్ నుంచి మొదలవుతుందని జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల మీద ఓట్లు వేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది అని అన్నారు. డిసెంబర్లో చెప్పింది రూ.49 వేల కోట్లు, జనవరి వచ్చేసరికి రూ.40 వేల కోట్లు, జూలై నాటికి రూ.31 వేల కోట్లు, చివరికి బడ్జెట్లో ఇచ్చింది రూ.26 వేల కోట్లు చివరకు చెప్పింది రూ.17 వేల కోట్లు తీరా రుణమాఫీ అయింది 7500 కోట్లు అని అన్నారు. 41.78 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మందికి రుణమాఫీ అయింది అని ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసి అంతే రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తెలిపారు. దేవుళ్లను కూడా వదలకుండా ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారనీ, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ శరతులు లేకుండా రుణమాఫీ చేయాలి లేకుంటే మరో ఉద్యమం తప్పదనీ అన్నారు. భారీగా పోలీస్ బలగాల మోహరింపు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు రుణమాఫీ కోసం రైతుల నిరసన దీక్షకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఇంచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ బస్వారెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు దేవారం నవీన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగరి విట్టల్ రావు, బిజెపి నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, పాలెపు రాజు, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ లకు చెందిన రెండు వేలకు పైన రైతులు పాల్గొన్నారు.