హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/24 ఆగష్టు: కర్ణాటకలోని వాల్మీకి ఆదివాసీ అభివృద్ధి కార్పొరేషన్‌లో జరిగిన స్కాం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి విధితమే. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ సూసైడ్ తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కర్ణాటక వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ నేతలు, వ్యాపార వేత్తలకు లింకులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి తెలంగాణకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ రూ.45 కోట్ల నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణం షాపు యజమానులు ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ బార్లు, బంగారు దుకాణాదారులతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలని ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని 9 మంది బ్యాంకు అకౌంట్లలో రూ.45 కోట్లు కర్ణాటక నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఆరోపించారు. ఈ వాల్మీకి కుంభకోణంకు సంబంధించి తెలంగాణలోనూ సిట్, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలు దర్యాప్తు సంస్థల సోదాల న్యూస్ బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారన్నారు.
మొత్తం రూ.95 కోట్ల అవినీతి జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారన్నారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమూ కూలుతుందని ఆ రాష్ట్ర మంత్రి సతీష్ అన్నారని గుర్తు చేశారు. అసలు కర్ణాటక సీఎంను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని ఆ రాష్ట్ర మంత్రి ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఈ స్కామ్‌లో ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదన్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.