విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులు సస్పెన్షన్..
పోలీసు శాఖలో జవాబుదారీతనం చాలా ముఖ్యం: జిల్లా ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ /తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే/19 ఆగష్టు: ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి : అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసినా నిర్లక్ష్యం చేసినందుకు హెడ్ కానిస్టేబుల్ 2882, S. బసవయ్య, హోమ్ గార్డ్ 1457, సుధాకర్ లను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు సస్పెండ్ చెసి సమాచారం తెలిసినా నిర్లక్ష్య ధోరణి చూపిన చంద్రగిరి CI కి చార్జి మెమో ఇచ్చారు. విధి విధానాలు క్రమశిక్షణ పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన ఫలితంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
నిర్లక్ష్యం ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తామనీ మరియు ప్రజల విశ్వాసాన్ని పొందడంలో రాజీ పడే ఏ ప్రవర్తనను సహించమనీ ఎస్పీ అన్నారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందనీ, తదుపరి శాఖాపరమైన విచారణను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. పోలీసింగ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం మరియు శ్రేష్ఠత చాలా ముఖ్యం నిబద్ధతను విస్మరిస్తే శాఖ పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామం నుండి అక్రమంగా గ్రావెల్ ను తవ్వి, టిప్పర్ లారీల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు చంద్రగిరి సీఐకి స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు పై విచారించి గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డు కొని చర్యలు తీసుకోవాలని చంద్రగిరి రక్షక్ మొబైల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్. బసవయ్య, హోంగార్డు సుధాకర్ లను సిఐ ఆదేశించారు. సదరు రక్షక్ మొబైల్ పోలీసులు అక్రమ గ్రావెల్ తవ్వకాలను, రవాణాను అడ్డుకోకపోగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని స్థానికులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి విచారణ జరిపారు. అక్రమార్కులకు వంత పాడినట్లు నిరూపణ కావడంతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా సదరు రక్షక్ మొబైల్ హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి, అలాగే చంద్రగిరి సీఐకి చార్జి మెమోను ఇచ్చారు. జిల్లాలో ఎవరైనా అవినీతికి పాల్పడిన లంచం తీసుకున్న, విధులలో అలసత్వం వహించిన, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తన కలిగిన అట్టి వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఘాటుగా జిల్లా పోలీసులులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు.