శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు..
2009లో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుందన్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ ఏటికేడు పెద్దదవుతున్నా రిపేర్లు చేయించని ప్రభుత్వాలు. నిధులు కేటాయించడానికీ ముందుకు రావట్లే..
హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీశైలం/10 ఆగష్టు: శ్రీశైలం ప్రాజెక్టు సెఫ్టీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి ఏర్పడి ఏండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు రిపేర్లు చేయడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాలు దీని రిపేర్ల ఖర్చులు భరించాల్సి ఉన్నా ఇప్పటివరకు చిల్లి గవ్వ కేటాయించలేదు. దీంతో గేట్లు ఎత్తిన ప్రతీసారి ఈ గొయ్యి మరింత పెద్దదిగా మారుతుండడంతో భవిష్యత్తులో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పట్టించుకోని ప్రభుత్వాలు..
శ్రీశైలం ప్రాజెక్టుకు అక్టోబరు 2, 2009లో భారీగా వరద వచ్చింది. కృష్ణా, తుంగభద్ర నదులు పొంగడంతో ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 22 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. డ్యాం నీటి మట్టానికంటే అధికంగా పది అడుగులు ఎక్కువగా వరద వచ్చి చేరింది. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని బంద్ చేసి, అన్ని గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఈ టైంలో వరద ఉధృతికి ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి నీళ్లు కిందపడే చోట (ప్లంజ్పూల్) వద్ద గొయ్యి ఏర్పడింది. మూడో గేట్నుంచి ఎనిమిదో గేట్మధ్యలో ఈ గొయ్యి ఉంది.
అయితే, గొయ్యిని పూడ్చాల్సి ఉన్నా 2009లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ, ఏపీ విడిపోగా 2014 నుంచి ప్రాజెక్టు మెయింటనెన్స్ను రెండు రాష్ర్టాలు చూసుకోవాల్సి ఉంది. ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి పూడ్చివేతకు రెండు రాష్ర్టాలు ఫండ్స్ కేటాయించాలి. కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. ఏపీ కూడా సైలెన్స్గానే ఉండిపోయింది. దీంతో ఈ గొయ్యి ఇప్పుడు పెద్దదై ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారింది. కాంక్రీట్ వేసి గొయ్యి పూడ్చకపోవడంతో ఇందులో నుంచి ఊట నీరు బయటకు వస్తోంది. దీంతో నిత్యం ఈ గొయ్యిలో నీరు నిల్వ ఉంటోంది.
ఏటికేడు పెరుగుతున్న గొయ్యి..
శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు 300 మీటర్ల ఎత్తులో ఉంటాయి. గేట్లు ఎత్తగానే 300 మీటర్ల నుంచి నీళ్లు కింద పడి 200 మీటర్ల నుంచి 300 మీటర్ల దూరం వరకు ఎగిసిపడతాయి. ఇక్కడే ప్లంజ్పూల్ఉంది. 2009లో నిరంతరాయంగా దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల ప్లంజ్పూల్వద్ద గొయ్యి ఏర్పడింది. అది ఏడాది కేడాదికి పెద్దదవుతోంది. ఐదేండ్ల కిందట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (ఎన్ఐవో) బృందం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యిని లోపలికి దిగి పరిశీలించింది.
గొయ్యిలోతు, పరిమాణంపై పూర్తి స్థాయిలో పరిశీలించాక దాదాపు150 అడుగుల లోతు ఉంటుందనే అంచనాకు వచ్చింది. వెంటనే రిపేర్లు చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ,మరమ్మతులు చేయించలేదు. దీంతో ఈ గొయ్యి మరింత పెద్దదై క్రమంగా డ్యామ్ గేట్ల వైపునకు విస్తరిస్తోంది. ఈ గొయ్యి గేట్ల వరకు విస్తరిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హెచ్చరించిన ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ..
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ఈ ఏడాది ఫిబ్రవరిలో నేషనల్ డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)తో కలిసి విజిట్ చేసింది. ఈ మేరకు శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను, పవర్ జనరేషన్ కేంద్రాలు, ప్లంజ్ పూల్ను పరిశీలించింది. ప్లంజ్ పూల్వద్ద ఏర్పడిన గొయ్యి వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించింది. గొయ్యిని పరిశీలించగా అది గతంలో కన్నా పెద్దదయ్యిందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుందని అంచనా వేసింది. ఈ మేరకు అలర్ట్గా ఉండాలని డ్యామ్ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ గొయ్యి వల్ల డ్యామ్తో పాటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలపై ప్రభావం ఉంటుందని చెప్పింది. కాగా..డ్యామ్ రిపేర్ల కోసం అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు. గతంలో రూ.190 కోట్లతో ప్రాజెక్టుకు రిపేర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, శాంక్షన్ చేయలేదు.