నల్ల కనెక్షన్లలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిలిచింది.
ఆగస్టు 1నాటికి గ్రామీణప్రాంతాల్లో
నల్లా కనెక్షన్లు ఉన్న రాష్ర్టాలు (శాతాల్లో)..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ట్యాప్ కనెక్షన్
2020-21నాటికే పెద్ద రాష్ర్టాల్లో మనమే టాప్
నల్లా కనెక్షన్లలో దేశ సగటు 77.83 శాతం మాత్రమే
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జల్‌శక్తి మంత్రి.
హ్యూమన్ రైట్స్ టుడే/07 ఆగష్టు:
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా తాగు నీటిని అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో 2021 నాటికే 100 శాతం ట్యాప్ కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సోమవారం రాజ్యసభకు వెల్లడించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇది సాధ్యమైంది. వివిధ రాష్ట్రాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్లపై జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నది. జేజేఎం పథకం (2019 ఆగస్టు 15) ప్రారంభించడానికే ముందే తెలంగాణలో 15.68 లక్షల (29.05 శాతం) గ్రామీణ కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్ ఉన్నది.
2019-20 సంవత్సరంలో 20.18 లక్షలు, 2020-21 సంవత్సరంలో 18.12 లక్షల గ్రామీణ కుటుంబాలకు అంటే మొత్తం 53.98 లక్షల (100శాతం) గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా జరిగింది. యూటీలో అండమాన్ నికోబార్, చిన్న రాష్ర్టాల్లో గోవా మనతోపాటు 2020-21 నాటికే 100 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చాయి. పంజాబ్, గుజరాత్ వంటి పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ నాలుగేండ్ల క్రితమే ప్రతి గ్రామీణ కుటుంబానికి నల్లాల ద్వారా రక్షిత మంచినీరు ఇచ్చిన రాష్టంగా నిలిచింది. తెలంగాణలో 53.98 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా 2020-21 నాటికే అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత తాగునీరు అందించినట్టు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ మంత్రి సోమవారం సమాధానం ఇచ్చారు. గ్రామీణ కుటుంబాలకు అందించే నల్లా కనెక్షన్లలో దేశ సగటు 77.83% మాత్రమే. తెలంగాణతోపాటు 11 రాష్ర్టాలు/యూటీలు ప్రతి ఇంటికి (100శాతం) నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించే రాష్ర్టాలుగా మారాయి. ఇందులో తెలంగాణ, గోవా, గుజరాత్, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలి, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. దేశంలో రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల్లో 33 శాతం, మరికొన్ని రాష్ర్టాల్లో 67 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ట్యాప్ కనెక్షన్లలో పశ్చిమబెంగాల్ అట్టడుగున ఉన్నది. ఆ తర్వాత రాజస్థాన్, కేరళ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాలు వరుసగా ఉన్నాయి.
2019 ఆగస్టు నాటికి 16.08 శాతమే
జల్‌జీవన్ మిషన్ ప్రారంభించిన 2019 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 3.23 కోట్ల నివాసాలకు (16.08 శాతం) మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 41.41 లక్షల కనెక్షన్లు కలుపుకొని 2024 ఆగస్టు 1 నాటికి దేశంలోని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న 12.80 కోట్ల నివాసాలకు ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 19.32 కోట్ల నివాసాలు ఉండగా, ఇందులో 15.03 కోట్లకుపైగా (77.83 శాతం) నివాసాలకు ట్యాప్ కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు అందుతున్నది.
రూ.40 వేల కోట్ల ‘భగీరథ’ ఫలితం
ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించే భగీరథ పథకానికి తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చుచేసింది. తెలంగాణకు జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.188.23 కోట్లు విడుదలచేశారు. కృష్ణా, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి 1.30 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ మార్గం ద్వారా రాష్ట్రంలోని 24 వేల గ్రామాలు, 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించింది. అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌కు కూడా తెలంగాణలోని భగీరథ ప్రాజెక్టు స్ఫూర్తిగా నిలుస్తున్నది.