హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 ఆగష్టు:
ప్రపంచీకరణ, పారిశ్రామీకీకరణ విస్తరించి వినియోగ సంస్కృతిని పెంచడంలో పట్టణాలు అభివృద్ధి చోదకా శక్తిగా నిలవడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పట్టణీకరణ బహుముఖ పాత్ర పోషిస్తుంది. విద్య’ వైద్య’ ఉపాధి కొరకు గ్రామీణ ప్రజలు పట్టణాలకు మారుతుంటారు. పట్టణ జనసాంద్రత పెరుగుతుంది. మౌలిక వసతులు పెరగడం లేదు. పారిశుద్ధ్యం లోపించి అంటు వ్యాధులు అగ్నిప్రమాదాలు’ ప్రకృతి వైపరీత్యాలు వరదలు పట్టణాలకు ప్రమాదకరంగా పరిణమించాయి.
ప్రభుత్వాలు_ పట్టణాల అభివృద్ధి _నిర్లక్ష్యం
కేంద్ర ‘ రాష్ర్ట’ ప్రభుత్వాలు నగరాలను’ పట్టణాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. ఆర్థిక కమిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్థానిక సంస్థలకు ఆశించిన మేరకు నిధులు రావడం లేదు. స్థానిక సంస్థల ఆర్థిక సాధికారత ఎండమావిగా మారింది.
ప్రభుత్వ యంత్రాంగం_ ఉదాసీనత_ అవినీతి
పట్టణాల అభివృద్ధికి సరిపోయే నిధులివ్వక పోవడం. యంత్రాంగంలో పేరుకు పోయిన ఉదాసీనత వ్యవస్థాగత మైనటువంటి అవినీతి వల్ల పట్టణాలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. వాన కాలంలో నరకానికి నకళ్ళుగా తయారవుతున్నాయి. శనివారం ఢిల్లీలో ఒక భవనం సెలార్లోకి వరద నీరు రావడం సివిల్స్ కు ప్రిపేర్అవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించడం పట్టణ భారత సంక్షోభ స్థితిగతులకు నిదర్శనం.
పట్టణాలు _సమస్యలు
సుస్థిరాభివృద్ధికి ఆధునికీకరణకు నవ నాగరికతకు సంకేతంగా నిలవాల్సిన నగరాలు నేడు అనేక సమస్యల్లో కూరుకుపోతున్నాయి. పట్టణాలలో జరుగుతున్న భూమి ఆక్రమణలపై జి’హెచ్’ఎం’సి రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడం చూసి చూడనట్లు ప్రవర్తించే అధికార యంత్రాంగం వల్ల సమస్యలు తీష్ట వేస్తున్నాయి.
ఆక్రమణలు _ రాజకీయాలు
పట్టణాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములను రాజకీయ పార్టీల నాయకులు పోటీ పడి ఆక్రమించి తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకొని
తమ వ్యాపార వాణిజ్యాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల నాయకులు చెరువులను నాలా లను కబ్జాలు చేయడం వల్ల జన వాసాలను వరదనీరు ముంచెత్తుతుంది. చిన్న పాటి చినుకులకే వరద నీరు హైదరాబాద్లోని పలు కాలనీలను జలదిగ్బంధంలో కి నెట్టివేస్తుంది. నగరాలు వరదలమయమై ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పారిశుద్ధ్యం _అంటు వ్యాధులు
వరదల వల్ల పలు కాలనీల్లో పరిశుభ్రత లోపించి అంటూ వ్యాధులు ప్రభలుతున్నాయి. మురికి పేరుకుపోయి రహదారులు గుంతలమయం కావటం ‘కరెంటు తీగలు తెగి రోడ్లమీద పడటం పురాతన భవనాలు హఠాత్తుగా కూలడం అపార జన నష్టం సంభవించడం వల్ల నేడు పట్టణాలు నరకాలకు నకళ్ళుగా మారినాయి.
గ్రామీణులు_ పట్టణ వలస
వ్యవసాయం గిట్టుబాటు గాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బతుకు తెరువు లేక చాలామంది ప్రజలు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్నారు. వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. నేటికి భారత దేశంలో పట్టణాల్లో నివసించే జనాభా 50 కోట్ల పైగా ఉంది ఇది రాబోయే సంవత్సరాల్లో మరింత పెరగనున్నదని పట్టణాభివృద్ధి అధ్యయనాలు తెలుపు తున్నాయి.
పట్టణాలు_ సుస్థిరాభివృద్ధి ప్రభుత్వ శ్రద్ధ
ఇప్పుడున్న పట్టణాలను ఆధునీకరించి అభివృద్ధి చేయకపోతే వలస వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం వుంది. భారతదేశం సుస్థిరావృద్ది సాధించాలంటే ఆహ్లాదకర జీవనానికి నెలవుగా పట్టణాలు విలసిల్లాలంటే నగరాల ప్రగతికి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పర్యావరణహిత_ పట్టణాభివృద్ధి
ప్రభుత్వం పట్టణాలను అభివృద్ధి పరిచేటప్పుడు పర్యావరణ రక్షణను కేంద్రంగా తీసుకొని ప్రణాళికలు రచించాలి. పర్యావరణాన్ని రక్షిస్తూ పరిమిత భూములను అభిషణీయంగా వినియోగించాలి. పట్టణాలలో లభించే ప్రకృతి వనరులను సహజ వనరులను’ భూములను సద్వినియోగం చేసుకోవాలి. సంపదను సృష్టించి ఉపాధి ఉత్పాదకతతో కూడిన నాణ్యమైన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన పట్టణాభివృద్ధి ప్రణాళికలను అనుసరించడం అత్యంత తక్షణ అవసరంగా ప్రభుత్వం గుర్తించాలి.
పట్టణాలు మురికివాడల నిర్మూలన
పట్టణాలలో మురికివాడల నిర్మూలన బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు బాల కార్మికులకు విద్య కేంద్రాలను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
జలసంరక్షణకు ప్రాధాన్యత
ఆకాశహర్మ్యాల నిర్మాణాలను నియంత్రించాలి. వర్షపు నీటిని సంరక్షించే జల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వరదలను అరికట్టాలి. భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రజలకు పరిశుద్ధమైన తాగునీటి వసతి సౌకర్యాలను మెరుగు పరచాలి.
పట్టణాలు _కాలుష్య నియంత్రణ
నగరాలలో పేరుకుపోతున్న వ్యర్ధాలు ‘పెరుగుతున్న జల కాలుష్యం ‘వాయు కాలుష్యం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. అక్రమాల మత్తులో ఉన్న నగర పురపాలక సంఘాలను ప్రక్షాళన చేయాలి. స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను అందించాలి. పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి.
ఇష్టమైన రీతిలో భవన నిర్మాణాలను అనుమతించ కూడదు. పట్టణ ప్రణాళిక అధికారులు నియమాలను తప్పకుండా పాటించేట్లు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెరుగుతున్న జనాభాకు కనీస వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి .అప్పుడు మాత్రమే పట్టణ భారతం ప్రజలకు నివాస యోగ్యమౌతుంది.
పౌర సేవలు కల్పించాలి
పట్టణాలలో ఏర్పడే సమస్యలను అధ్యయనం చేయాలి. వలసలను అరికట్టాలి. బలమైన మహా నగరాలకు బలమైన ఆర్థిక పునాదులు నిర్మించాలి. నిర్లక్ష్యంలో ఉన్న చిన్న పట్టణాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలి. వలసలను మళ్ళించాలి. పట్టణ ఆర్థిక వ్యవస్థ సామర్ధ్యం పెంచాలి.
సుస్థిరాభివృద్ధి పర్యావరణం
సుస్థిరాభివృద్ధి పర్యావరణ హితమైన విధానాల ద్వారా పట్టణ వ్యవస్థల నిర్మాణం జరగాలి. మహానగరాలను పట్టణాలను గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా ప్రకటించాలి. నవీన పట్టణీకరణ అనే భావాన్ని ప్రచారం చేయాలి.
స్మార్ట్ సిటీల విస్తరణ
స్మార్ట్ సిటీలను విస్తరించాలి. పర్యావరణ రక్షణ పేదరిక నిర్మూలన ‘లక్ష్యంగా పట్టణ పరిపాలనలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలి. ప్రజల జీవన నాణ్యతను పెంచాలి. క్రమపద్ధతిలో పట్టణ ప్రణాళికలను అమలు చేయాలి. జలవాయు కాలుష్యాన్ని అరికట్టాలి. చెరువులు, నాలాల ఆక్రమణలను అరికట్టాలి. ఆక్రమించిన వారిమీద చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలను నియంత్రించాలి. నగరాలలో మాస్టర్ ప్లాన్ పాటించాలి. జీవన నాణ్యతను పెంచడానికి పట్టణీకరణను ఒక క్రమ పద్ధతిలోసుస్థిరంగా అభివృద్ధి చేయాలి. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నగర మున్సిపాలిటీ’ మున్సిపల్ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి. పాలన వికేంద్రీకరణ ద్వారా పట్టణాల అభివృద్ధికి సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలి.
నేదనూరి కనకయ్య
రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం ‘సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక కరీంనగర్ 9440245771