హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రేకి చెప్పినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దాదాపు అరగంట పాటు ఠాక్రేతో సమావేశమైన ఆయన.. సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలకు వారం.. 10 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే ఉపయోగం ఉండదన్న వెంకటరెడ్డి.. 50, 60 రోజుల ముందే ప్రకటించాలని ఇన్‌ఛార్జికి చెప్పినట్టు తెలిపారు. కార్యకర్తలను పోరాటానికి సిద్ధం చేయాలని, వచ్చే ఆరు నెలలు ప్రజా పోరాటాలు బలంగా చేయాలని వాటన్నింటిపై ఇన్‌ఛార్జితో చర్చించానని వివరించారు. గాంధీ భవన్‌లో సమావేశాలు తగ్గించి ప్రజల్లో ఉండాలని చెప్పానన్నారు. ఇన్‌ఛార్జి కూడా జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టాలని సూచించానని, అందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. వీటితో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు వివరించారు.