హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/28 జూన్: కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, భారాస అధినేత కె.చంద్రశేఖర్ రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసింది. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎక్కడా వివాదాలకు పోలేదని తెలిపారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని కోర్టుకు వివరించారు. విలేకరుల సమావేశంలో ఆయన ఎక్కడా వివాదాస్పద అంశాలు మాట్లాడలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.