టీడీపీ శ్రేణులకు కీలక సూచన..
ఏపీలో ఘర్షణలపై చంద్రబాబు రియాక్షన్..
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ/అమరావతి/జూన్ 08: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా బాబు సమాచారం అందుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు చేశారు.
ఇంతకీ ఏమన్నారు..?
‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్‌గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలి. వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబు స్పందించి ఈ సూచనలు చేశారు. దీంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా పోలీసులు ఎక్కడా దాడులు జరగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్ ఇలా..?
ఇదిలా ఉంటే.. వైసీపీ మాత్రం తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులు చేస్తున్నారని చెబుతోంది. ఈ దాడులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.