హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 30: తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త లోగో ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించింది. చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దు కోనున్నట్లు చెబుతున్నారు.
అయితే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సరికాదని బీఆర్ఎస్ వర్గాలు మండి పడుతున్నాయి.