పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారుల దృష్టి..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 23: మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

2019లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గత ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతుండడంతో పంచాయతీరాజ్శాఖ అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరిగే అవకాశం ఉండడంతో అవసరమైన బ్యాలెట్ బాక్సులు సమకూర్చడంపై దృష్టి పెడుతున్నారు. అంతేగాక పాత రికార్డులు పరిశీలిస్తూ మండలాల వారీగా గత ఎన్నికల్లో ఏ పంచాయతీ, ఏ వార్డులు ఎవరికి రిజర్వ్ అయ్యాయో గుర్తిస్తున్నారు.

ఆశావహుల ఉత్సాహం

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ఉండడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. సర్పంచ్ పదవులపై కన్నేసిన నేతలు ఇప్పటి నుంచే తమదైన రీతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాము ఈ సారి ఎన్నికల బరిలో ఉంటామనే విషయాన్ని కొందరు ప్రత్యక్షంగా, మరి కొందరు పరోక్షంగా వెల్లడిస్తున్నారు. గ్రామంలోని వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే ఆందోళన ఆశావహుల్లో నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత పంచాయతీ ఎన్నికల సమయంలో రెండు విడుతల వరకు ఒకే రిజర్వేషన్అమలులో ఉంటుందని చెప్పింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున గత ప్రభుత్వం చెప్పినట్టు ఈ సారి అదే రిజర్వేషన్ కొనసాగిస్తారా.. లేదా మారుస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.

1,615 పంచాయతీలు

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు, 5,778 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు 4,476 వార్డులు, మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు ఉన్నాయి.

ముంపు గ్రామాల సంగతేంటి..?

సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్ ప్రాజెక్టుల వల్ల 10 గ్రామ పంచాయతీలు ముంపునకు గురయ్యాయి. గతంలో ఆయా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ముంపునకు గురైన గ్రామాల నిర్వాసితుల కోసం గజ్వేల్, తునికి బొల్లారంలో ప్రత్యేకంగా ఆర్అండ్ఆర్ కాలనీలు నిర్మించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ముంపునకు గురైన పది గ్రామాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రస్తుతం అవే పేర్లతో కాలనీలు కొనసాగుతున్నాయి. అయితే అవి రద్దేయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న జాబితాలో పది గ్రామాలు తగ్గే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment