గర్భిణులు, బాలింతలకు అండర్‌టేకింగ్‌ ఉంటేనే తుది రాతపరీక్షకు అనుమతి

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: గర్భిణులు, బాలింతలు ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనకున్నా తుది రాతపరీక్ష అర్హత పొందాలంటే అండర్‌టేకింగ్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) స్పష్టం చేసింది. వారు తుది రాతపరీక్షలో అర్హత సాధిస్తే ఆ పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరవుతామని లిఖితపూర్వకంగా ధ్రువీకరించాల్సి ఉంటుందని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ ధ్రువీకరణను ఈ నెల 31లోపు డీజీపీ కార్యాలయంలోని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఇన్‌వార్డు సెక్షన్‌లో నేరుగా ఇవ్వాలని సూచించారు. ధ్రువీకరణతో పాటు మెడికల్‌ సర్టిఫికెట్లను తప్పక ఇవ్వాలన్నారు. గర్భం కారణంగా శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనలేకపోయామని పలువురు కోర్టును ఆశ్రయించడంతో వారికి మరో అవకాశమివ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కోర్టును వ్యక్తిగతంగా ఆశ్రయించి ఉత్తర్వులు పొందాక వినతిపత్రాలు సమర్పించిన అభ్యర్థులూ అండర్‌టేకింగ్‌ కచ్చితంగా ఇవ్వాలని మండలి సూచించింది. మండలి వెబ్‌సైట్‌లోని ప్రత్యేక ప్రొఫార్మాలోనే ఈ ధ్రువీకరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 పోస్టుల ప్రాథమిక కీ విడుదల
మహిళాశిశు సంక్షేమశాఖలో సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు ఈనెల 8న నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కీతో పాటు మాస్టర్‌ప్రశ్నపత్రం, పరీక్షకు హాజరైన 33,405 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ కాపీలను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ ప్రిలిమినరీ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను ఈనెల 21 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్లో ఇంగ్లిష్‌లో నమోదు చేయాలని సూచించింది. ఈ-మెయిల్స్‌, రాతపూర్వక ఫిర్యాదులు పరిశీలించబోమని స్పష్టం చేసింది.మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడాలని కమిషన్‌ కోరింది. అభ్యర్థుల డిజిటల్‌ ఓఎంఆర్‌ కాపీలు ఈనెల 21 నుంచి ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment