సామాజిక న్యాయం అంటే.. కొడుకు.. బిడ్డకు పదవులివ్వడమా?: లక్ష్మణ్‌

Get real time updates directly on you device, subscribe now.

భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: గుజరాత్‌ తరహా అభివృద్ధి తెలంగాణకు కావాలని.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించినట్లుగానే అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై భాజపా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం సాధించి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాసిన ‘పరీక్ష యోధులు’ (‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ రచనకు తెలుగు అనువాదం) పుస్తకాన్ని శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి, ఎన్వీ సుభాష్‌, సంగప్పలతో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తన పార్టీని భారాసగా మార్చినా కేజ్రీవాల్‌, అఖిలేశ్‌యాదవ్‌లను రప్పించుకున్నా అది ప్రజల ఆదరణ పొందదని, జాతీయ రాజకీయాల్లో తోకపార్టీగా మిగులుతుందని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో అవినీతి, కుటుంబ, నిరంకుశపాలనపై 16, 17 తేదీల్లో దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాం. తెలంగాణలో అధికారం సాధించడమే మా లక్ష్యం. బండి సంజయ్‌ తన పాదయాత్రతో ప్రజల్ని చైతన్యవంతులను చేశారు’ అని లక్ష్మణ్‌ వివరించారు.

‘గుజరాత్‌ మోడల్‌పై కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. గుజరాత్‌లో భాజపా వికసించింది. తెలంగాణలో సామాజిక న్యాయం అంటే.. తండ్రి, కొడుకు, బిడ్డ, మేనల్లుడికి పదవులా? కేటీఆర్‌ చదువుకున్న అజ్ఞాని’ అంటూ లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు. సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ జాతీయకార్యవర్గ సమావేశంలో సంజయ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించడాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment