హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 06: ఎన్నికల వేళ దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 200 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. నగరంలోని మూడు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల వద్దకు చేరుకొని డాగ్‌స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.