హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 మే: కాపు నేత ముద్రగడ పద్మనాభం అంటే నాకు చాలా గౌరవం! తన సామాజిక వర్గం కోసం తన రాజకీయ భవిష్యత్ ను చేజేతులా తనే కూల్చుకున్న శక్తివంతుడు! ఇప్పటి సంగతి కాదు! తన రాజకీయ కెరీర్ ప్రారంభం నుంచి గమనిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది! బొత్స లానో ఇంకొకరిలానో కాస్త రాజీ పడి ఉంటే ప్రతి ప్రభుత్వంలో కీలక మంత్రి మాత్రమే కాకుండా ఆయా ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించి వుండే వారు! కానీ, ఆయనకు రాజకీయాలు సహకరించలేదు!
ఆయన ఎత్తులు, వ్యూహాలు ఆయనకే సహకరించలేదు! పార్టీలతో ఆయనకు సరిపడలేదు! ఆయా పార్టీల ముఖ్య నేతలతో ఆయన రాజీ పడలేక పోయారు! ఇక వేరే దారి లేక, కాపు సామాజిక వర్గాన్ని ఉద్దరించే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు! ఇది మొదట్లో ఆయనకు బాగా కలసి వచ్చింది! కాపు నాయకుడిగా బలమైన ముద్ర వేయగలిగారు. మంచి పేరు తెచ్చుకున్నారు.
తరువాత పరిణామాలు, ఆయన ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు అన్నీ తిరగబడ్డాయి! తుని సభ ఎంత సంచలనమో అంత వివాదాన్ని సృష్టించింది. అక్కడ నుంచి ఆయనకు వరసగా ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి! ఒక్కో నేత ఆయనకు దూరం అవుతూ వచ్చారు! బలమైన ఒక్క కాపు నేత కూడా ఆయన కోటరీలో లేని పరిస్థితికి చేరుకున్నారు!
దారులన్నీ మూసుకుపోయాయి! మరో వైపు పవన్ కళ్యాణ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు! వేరే దారిలేక వైసీపీ తలుపు ఆయనకు ఆయన తట్టారు! జగన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నేతల అవసరం తప్పనిసరి! కండువా కప్పేసారు! కనీసం ఆయన ప్రభావం ఆయన ఇలాకాలో లేకపోయినా, రాష్ట్రంలో ఎక్కడో కొంత అయినా ప్రభావం ఉంటుందనే ఆశ జగన్ ది!
ఇప్పుడు ముద్రగడ ప్రధాన లక్ష్యం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను ఓడించడమే! జగన్ ఇచ్చిన టార్గెట్ అది! ఎలాగయినా పూర్తి చేయాలని ముద్రగడ శపధం! అందుకే కుయుక్తులు పై ఎత్తులు వేస్తున్నారు! ఆ ఎత్తుగడలు కుమార్తె దాకా వచ్చాయి! కుమార్తె క్రాంతి సహించలేకపోయింది! తండ్రికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ కు మద్దతు గా వీడియో చేసి జనంలోకి వదిలింది!
ఇప్పటి వరకు ముద్రగడకు జనంలో సానుభూతి ఉందనుకున్న! అది కాస్త అయన తాజా గా ఇచ్చిన స్టేట్మెంట్ తో పోయిందనిపిస్తోంది! పవన్ కళ్యాణ్ ను ఓడిస్తా, ఒకవేళ ఆయన గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డి గా మార్చుకుంటా అనడం ముద్రగడకు మతి పోయిందేమో అనిపించింది! బహుశా జగన్ మనసును దోచుకునే ప్రయత్నంలో భాగంగా మైండ్ గేమ్ అయి ఉండొచ్చు కానీ, అది బెడిసి కొట్టింది! బయట జనం సరేసరి! కుటుంబ సభ్యులకు కూడా ఆయన చేస్తున్న చేష్టలు నచ్చడం లేదు! తల్లి ద్వారా విషయం తెలుసుకున్న కుమార్తె క్రాంతి ఆయనకు అడ్డం తిరిగింది! కుటుంబ సభ్యులకే నచ్చని రాజకీయం బయట వాళ్ళకు ఎలా నచ్చుతుంది? ఒక్కోసారి మహా నేతలు అనుకున్న వాళ్ళు, వాళ్ళకు వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతుంటారు! అందుకు ముద్రగడ తాజా నిదర్శనం!